నిరూపించు

28-09-2026 | 05:25am

ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ 

  1. సిరిసిల్ల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  2. మీరు చెప్తున్న 8 వేల ఎకరాల భూమి ఎక్కడుంది? 
  3. రికవరీ చేశామన్న 2,400 ఎకరాలు ఎక్కడివి?
  4. సిరిసిల్లకు వస్తే ప్రజల సమస్యలపై స్పందించాలి
  5. హామీల అమలుపై తేదీలు ప్రకటించాలని డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): సిరిసిల్లలో బీఆర్‌ఎస్ నాయకులు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని, అందులో 2,400 ఎకరా లను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)చేసిన ఆరోపణలు నిరాధారమని అక్కడి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. ఆ ఆరోపణల్లో వాస్తవముంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

2014 నుంచి 2023 డిసెంబర్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,272 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ జరిగిందని, అందులో సిరిసిల్ల నియోజక వర్గంలో కేవలం 204 ఎకరాలు పంపిణీ చేశామని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతుల అభ్యర్థనల మేరకు, అర్హత ప్రకారం రికార్డులు సవరించామని ఆయన పేర్కొన్నారు. ‘8 వేల ఎకరాల భూమి ఎక్కడుంది? అందులో 2,400 ఎకరాలు ఏ భూమి? ఏ మండలం? ఏ గ్రామం? ఏ సర్వే నంబర్? ఎవరి పేరుపై ఉంది? ఎంత విస్తీర్ణం?

అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలి’ అని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. ఆరోపణలను రుజువు చేయలేకపోతే సిరిసిల్ల ప్రజలకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లకు వస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రికి తాను స్వాగతం పలుకుతున్నానని లేఖలో పేర్కొన్నారు. సీఎం హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు కాకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలన్నారు. 

నేతన్నలకు సమాధానం చెప్పాలి..

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేసి 2024లో నేతన్నలకు పూర్తిగా ఉపాధి లేకుండా చేసిందని ఆయన  ఆరోపించారు. నేతన్నల పోరాటం తర్వాత చీరల పథకాన్ని మరో పేరుతో ప్రారంభించినా దాన్ని కేవలం మహిళా సంఘాలకు పరిమితం చేశారన్నారు.

పాత బకాయిలన్నీ చెల్లించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. రూ.300 కోట్ల బకాయిల్లో ఇంకా రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపారు. నేతన్నలకు చెల్లించిన 10 శాతం యార్న్ సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, రూ.60 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారని, 10 శాతం యార్న్ సబ్సిడీని ఎప్పుడు విడుదల చేస్తారని, దీనిపై  స్పష్టమైన తేదీలు ప్రకటించాలని.. వీటిపై నేతలకు సీఎం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

‘ఎగ్గొట్టిన రైతుబంధు బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో, ఎకరాకు రూ.15 వేల చొప్పున ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా ప్రకటించాలి. కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతుబంధు ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారో సీఎం ప్రకటించాలి. ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామీని సంపూర్ణంగా ఎప్పటిలోగా అమలు చేస్తారో  స్పష్టం చేయాలి”  అని పేర్కొన్నారు.  

మీరు చేపట్టిన అభివృద్ధి ఏమిటి?

సిరిసిల్ల నియోజకవర్గంలో సాగునీటి సామర్థ్యాన్ని 1.36 లక్షల ఎకరాలకు పెంచామని కేటీఆర్ తెలిపారు. మల్కపేట నుంచి అప్పర్ మానేరు వరకు నీటిని ఎప్పుడు తరలిస్తారు? డిస్ట్రిబ్యూటరీ కాలువలను ఎప్పుడు మంజూరు చేస్తారు? అని సీఎంను ప్రశ్నించారు. జిల్లాలో చెరువుల అభివృద్ధికి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ఎన్ని కోట్లు కేటాయిస్తారో సీఎం ప్రకటించాలన్నారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి అవసరమైన నిధులను సిరిసిల్ల పర్యటనలోనే ప్రకటించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

‘2014 నుంచి 2023 వరకు సిరిసిల్ల పట్టణంలో సుమారు రూ.1,564 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను పత్రికాముఖంగా సీఎం విడుదల చేయాలి. గత ప్రభుత్వ కాలంలో మంజూరైన సుమారు రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను విడుదల చేసి పనులు పూర్తి చేయాలి. సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని రోడ్లు, ఎన్ని భవనాలు మంజూరు చేస్తారు? వెంటనే ఎన్ని నిధులు విడుదల చేస్తారు? సిరిసిల్ల సహకార విద్యుత్ పంపిణీ సంస్థ సెస్స్‌ను ఎందుకు రద్దు చేశారు? వీటన్నింటిపై సిరిసిల్ల ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి’  అని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. 

మరిన్ని వార్తలు