ఇస్లామాబాద్‌లో కంటైనర్ల కంచె
- పీటీఐపీ వార్నింగ్‌తో సున్నిత జోన్ ప్యాకప్
- అక్టోబర్ 4కు నిరసన వాయిదా
- నష్టపోతున్నామని ట్రక్కు డ్రైవర్లు, యజమానుల ఆవేదన
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 29: పాకిస్థాన్‌లోని(Pakistan) ఇస్లామాబాద్‌లో(Islamabad) పీటీఐపీ (తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ(Tehreek-e-Insaf Party)) ఇమ్రాన్‌ఖాన్(Imran Khan) పార్టీ చేపట్టనున్న నిరసనల పిలుపుతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇస్లామాబాద్ నగరంలో 1500కుపైగా కంటైనర్లను మోహరించి ‘కంటైనర్ల’ నగరంగా మార్చింది. తొలుత 27న నిరసన తెలుపుతామని పీటీఐపీ ప్రకటించగా, ప్రభుత్వం అలర్ట్ అయి నిరసన ప్రాంతాలైన ప్రధాన రహదారుల్లో భారీ ఎత్తున షిప్పింగ్ కంటైనర్లను పోలీసులు అడ్డు పెట్టారు.
దీంతో వివాదం రాజుకుంది. అక్టోబర్ 4న నిరసనను వాయిదా వేస్తున్నట్లు మంగళవారం పీటీఐపీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టకుండా ప్రభుత్వం గతంలో కూడా ఈ షిప్పింగ్ కంటైనర్లను ప్రధాన రహదారులపై అడ్డుపెట్టడం సర్వసాధారణం. 2023 నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. అయితే నిరసన చేపట్టనున్న ప్రాంతాల్లో పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ రాయబార కార్యాలయాలు, అత్యంత సున్నితమైన రెడ్‌జోన్ కిందకు వస్తుండడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
కాగా ప్రభుత్వ చర్యతో కంటైనర్ల యాజమానులు, డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బలవంతంగా తమ వాహనాల తాళాలు తీసుకొని కంటైనర్లను రోడ్డుపై పెట్టిస్తున్నారని, ఒక్కరోజుకే ఎంతో నష్టం వాటిల్లుతుందని, ఇన్నిరోజులు కంటైనర్లు రోడ్డుపై పెట్టాలంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం ట్రక్కు యాజమానులకు డబ్బు చెల్లిస్తామని చెబుతుండడం విశేషం.