6 June, 2026 | 6:57 PM

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

06-06-2026 05:54 PM

ప్రకృతి సమతుల్యతతోనే మానవ మనుగడ

 మంథని అటవీ రేంజ్ అధికారి ఎం. వినయ్ నాయక్

ముత్తారం,(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంథని అటవీ శాఖ ఆధ్వర్యంలో ముత్తారం మండలం పారుపల్లి పెద్ద చెరువు వద్ద శనివారం 'బర్డ్ వాక్ అండ్ వైల్డ్ లైఫ్ అవేర్‌నెస్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంథని అటవీ రేంజ్ అధికారి వినయ్ నాయక్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ వినయ్ నాయక్ మాట్లాడుతూ, ప్రకృతిలో జీవ వైవిధ్యం మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకమని అన్నారు. పక్షులు, వన్యప్రాణులు పర్యావరణ చక్రంలో కీలక భాగమని, వాటిని సంరక్షించడం ద్వారానే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అడవులు, జలవనరులు, సహజ సంపదను కాపాడుకోవడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా యువతకు, గ్రామస్తులకు 'బర్డ్ వాచింగ్', 'ట్రెక్కింగ్' ద్వారా అడవుల్లో ఉండే వివిధ రకాల పక్షులు, జీవజాతులపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. చెరువు పరిసరాల్లో ఉన్న వన్యప్రాణుల సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. పారుపల్లి సర్పంచ్ చొప్పరి సంపత్ మాట్లాడుతూ, తమ గ్రామం పరిధిలో ఉన్న ప్రకృతి సంపదను కాపాడుకోవడంలో గ్రామస్తులందరూ అటవీ శాఖకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.