ఏబీఏపీ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా పుల్లంరాజు

22-09-2026 | 10:12pm

- తెలంగాణా నుంచి స్థానం లభించడంపై అయ్యప్ప భక్తుల హర్షం

నస్పూర్, (విజయక్రాంతి): రెండేళ్లకోసారి జరిగే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ (ఏబీఏపీ) ట్రస్ట్ ద్వైవార్షిక ఎన్నికలల్లో తెలంగాణకు చెందిన తోకచిచ్చు వెంకట పుల్లంరాజు (టీవీ పుల్లంరాజు) ఏబీఏపీ ట్రస్ట్(ABAP Trust) ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేరళకు చెందిన కే అయ్యప్పదాస్ అధ్యక్షులుగా, తెలంగాణకు చెందిన టీవీ పుల్లంరాజు ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా తమిళనాడుకు చెందిన ఆర్ వెంకటేశన్లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ట్రస్ట్ సభ్యులుగా వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు తెలంగాణ నుంచి రాచర్ల రమేష్ (హైదరాబాద్), బయ్యాన సంతోష్ (హనుమకొండ), ఏపీ నుంచి లంకబాబు (విజయవాడ), ప్రవీణ్ నంబూద్రి (విశాఖపట్నం), తమిళనాడు నుంచి ఎల్ఆర్ రాజు (కరూర్), వినాయగం (రాణిపేట), టీ వెంకటేశన్ (తిరువణ్ణామలై), కర్ణాటక నుంచి వంశీకృష్ణలు ఎన్నికయ్యారు. ఏబీఏపీ మేనేజింగ్ ట్రస్టీని పీఎన్కే మేనన్ ఎన్నికల అధికారిగా, ఏబీఏపీ ప్రధాన కార్యదర్శి బెల్లపు హరిప్రసాద్ పరిశీలకులు నిర్వహించారు. 

తెలుగు రాష్ట్రాలకు గౌరవం...

అయ్యప్ప స్వామి భక్తుల సేవా ట్రస్ట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి ప్రధాన కార్యదర్శి పదవి దక్కడం ఇదే ప్రథమం. తెలంగాణా నుంచి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా పుల్లంరాజు, కోశాధికారిగా రాచర్ల రమేష్, సబ్యులుగా సంతోష్లు ఏకగ్రీవంగా ఎన్నిక పట్ల తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు, ఏబీఏపీ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా పుల్లంరాజు మాట్లాడుతు శబరిమలలో అయ్యప్ప స్వామి భక్తులకు అందించే సేవల్లో తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం మరింత పెరగనుందన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ట్రస్ట్ సేవలను విస్తరించేందుకు, ట్రస్ట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా మండల, సీజన్లో శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు అన్నదాన మండపం ద్వారా నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. జ్యోతి మకరవిళక్కు సీజన్లో ఎనిమిది లక్షల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలను సమర్థవంతంగా నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు