లోక్‌భవన్‌కు చేరిన శుద్ధీకరణం!
- ప్రజల్లో అసమానతలకు దారితీసే ప్రమాదం
పసుపు నీళ్లతో శుద్ధి దళితులను అవమానించడమే
బీఆర్‌ఎస్ తీరుపై గవర్నర్‌కు మంత్రుల ఫిర్యాదు
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : దళితులు తిరిగిన నేలను బీఆర్‌ఎస్ శ్రేణులు (BRS cadres) శుద్ధి చేసిన వ్యవహారం చివరకు లోక్‌భవన్‌కు (Lok Bhavan) చేరింది. బీఆర్‌ఎస్ నేతల తీరుపై మంత్రులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తలవంపు తెచ్చేలా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్నదని ఆవేదన చెందారు. ఎర్రవల్లిలో నేలను శుద్ధి చేయడాన్ని ఖండించారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో బుధవారం మంత్రులు దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, వెడ్మ బొజ్జు కలిసి లోక్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. బీఆర్‌ఎస్ నాయకుల చర్యలపై ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ దళితులు డప్పులు కొట్టిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం యావత్ సమాజాన్ని అవమానించడమేనని ఆక్షేపించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని, డప్పు కొట్టడం దళితుల సంప్రదాయ వృత్తిలో భాగమని గుర్తుచేశారు. నిరసనల్లో డప్పులు వా డడం కొత్తేమీ కాదన్నారు. తెలంగాణ ఏర్పడితే సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీలను నిమ్నంగా భావించే పరిస్థితులు బాధాకరమన్నారు.