బంధువుల పెత్తనానికి చెక్ !?
- మహిళా ప్రజాప్రతినిధుల విధుల్లో జోక్యం లేకుండా చర్యలు
- ఫ్రాక్సి పాలనకు తావులేదు: కలెక్టర్
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మహబూబాబాద్, సెప్టెంబర్ 28: గ్రామపంచాయతీల్లో(Gram Panchayat) ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధుల(Women representatives) స్థానంలో వారి భర్తలు, బంధువులు అధికారిక విధుల్లో జోక్యం చేసుకోవడం, పంచాయతీ వ్యవహారాలను నిర్వహించడం వంటి అంశాలపై మహబూబాబాద్ జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. మహిళా సర్పంచులు(Women Sarpanches), వార్డు సభ్యుల అధికారాలను వారి బంధువులు వినియోగించ కుండా కట్టడి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(District Collector Sneha Sabarish) అధికారులను ఆదేశించారు. ఇటీవల జిల్లాలోని గ్రామాల్లో పంచాయితీలకు ఎన్నికైన మహిళ సర్పంచులు, వార్డు సభ్యుల కుటుంబ సభ్యుల పెత్తనం మితిమీరిందనే విమర్శలు వెల్లువెత్తాయి.
అలాగే కొన్నిచోట్ల మహిళా సర్పంచుల కు బదులు వారి పతులు పెత్తనం చలాయించడమే కాక ఆర్థికపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సెప్టెంబర్ 7న జారీ చేసిన ఉత్తర్వుల్లో గ్రామపంచాయతీల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు స్వయంగా తమ విధులను నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు, బంధువులు పంచాయతీ సమావేశాలకు హాజరు కావడం, తీర్మానాలు, అభివృద్ధి పనులు తదితర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
మహిళా ప్రజాప్రతినిధులకే అధికారాలు
గ్రామపంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు తమ అధికారాలను స్వయంగా వినియోగిం చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారి స్థానంలో భర్తలు, బంధువులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా నిర్ణయాలు తీసుకోవడం అనుమతించరాదని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధుల బంధువులు పంచాయతీ కార్యాలయాల్లో అధికారిక కార్యకలాపాలు నిర్వహించడం, సమావేశాల్లో వారి స్థానంలో వ్యవహరించడం వంటి చర్యలను నిరోధించాలని ఆదేశించారు.
నిబంధనల ప్రకారం చర్యలు
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 37(5) ప్రకారం ప్రజాప్రతినిధులు తమ విధులను నిర్వహించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధుల బంధువుల జోక్యాన్ని అనుమతించ కుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థాయిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత అధికారులు తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అధికారులదే పర్యవేక్షణ బాధ్యత
మండల స్థాయిలో ఎంపీవో, ఎంపీడీవో, డీ ఎల్ పీ వో తదితర అధికారులు గ్రామపంచాయతీల కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో ఇతరులు అధికారాలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన స్థానిక సంస్థల ప్రాతినిధ్యం కేవలం పదవికే పరిమితం కాకుండా, నిర్ణయాధికారం కూడా వారికే ఉండేలా గ్రామపంచాయతీ పాలన సాగించాల్సిన అవసరం ఉందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.