19 May, 2026 | 8:23 PM

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం: ఎండి రజాక్

19-05-2026 07:07 PM

- కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఏఐటీయూసీ

కొత్తగూడెం,(విజయక్రాంతి): ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ముఖ్య అతిథిగా పాల్గొనీ మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చి నేటి వరకు ,ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కార్మికులను మభ్యపెడుతున్నటువంటి గుర్తింపు సంఘం, ఏఐటీయూసీ నాయకులు అని మాట్లాడారు.

సింగరేణిలో ఏఐటీయూసీ గెలిచిన తర్వాత, సింగరేణి యాజమాన్యం కార్మిక వర్గానికి నష్టం వాటిల్లే , ఎటువంటి ఏ సర్కులర్ వచ్చినప్పటికీ గుర్తింపు సంఘం యాజమాన్యంతో మాట్లాడకపోవడంపై ,గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని ,గుర్తింపు సంఘం నాయకులు కేవలం వాళ్ల అస్తిత్వం కోసం మాత్రమే కార్మికులను మభ్యపెడుతున్నారని ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ మండిపడ్డారు. సింగరేణి సంస్థలో గతంలో ఎన్నడు లేని విధంగా సుదీర్ఘకాలంగా అండర్ గ్రౌండ్ మైన్ లో పనిచేసినటువంటి ఉద్యోగులను , వాళ్ల సీనియార్టీ ప్రకారం సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ గా అదే ఏరియాలో సర్దుబాటు చేసే ప్రక్రియ ఉండేదని ,

ఇప్పుడు యాజమాన్యం కార్మిక వర్గానికి నష్టం చేకూరే విధంగా వివిధ ఏరియాలను కలిపి సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్స్ నియామకం చేపట్టడం వల్ల ఏరియాలో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. అదేవిధంగా గతంలో సరిగ్గా విధులకు హాజరుకాని ఉద్యోగులను , వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి విధులకు హాజరయ్యే విధంగా చూసేవారని , కానీ ఇప్పుడు ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా విధులకు హాజరుకాని ఉద్యోగులకు 150 మాస్టర్లు ఉండాలని నిబంధనల సర్కులర్ రావడం , మాస్టర్లు పూర్తికాని ఉద్యోగుల ఇంక్రిమెంట్ కోత విధానం లాంటి కార్మికులకు నష్టం జరిగే విధానాలను యాజమాన్యం ప్రవేశపెట్టినప్పటికీ చోద్యం చూస్తున్న ఏఐటీయూసీ గుర్తింపు సంఘం నాయకులు అని మాట్లాడారు.

కార్మిక వర్గం గుర్తింపు సంఘం చేసే ప్రతి పనిని గమనిస్తుందని భవిష్యత్తులో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటియుసి యూనియన్ నాయకులకు కార్మిక వర్గం తగిన బుద్ధి చెబుతుందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ ,  ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి మెడికల్ బోర్డు నిర్వహణ , సింగరేణిలో నూతన బొగ్గు గనులు , సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మారు పేర్లు సమస్య పరిష్కరిస్తామని ఒక ప్రకటనలో తెలియజేశారు.