భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలి
- ఐక్యరాజ్యసమితి అధినేత ఆంటోనియో గుటెర్రెస్
- యూఎన్‌జీఏ మొత్తం ప్రతినిధులు నిలబడి అభినందనలు
ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 22: ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా, నేటి భౌగోళిక రాజకీయ సవాళ్లను(Geopolitical challenges) ఎదుర్కోవడానికి అవసరమైన చట్టబద్ధతను కలిగి ఉండేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని(United Nations Security Council) సంస్కరించాలని ప్రపంచ నాయకులకు యూఎన్ అధినేత ఆంటోనియో గుటెర్రెస్(Antonio Guterres) మంగళవారం బలమైన పిలుపునిచ్చారు. నేటి సవాళ్లకు అవసరమైన చట్టబద్ధత(Legality), సమర్థతతో, ప్రస్తుత ప్రపంచాన్ని ప్రతిబింబించేలా మనం భద్రతా మండలిని సంస్కరించాలని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(United Nations General Assembly) 81వ సమావేశంలో మంగళవారం జరిగిన సాధారణ చర్చల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. యూఎన్ అధినేతగా యూఎన్‌జీఏ అత్యున్నత స్థాయి చర్చలో తన చివరి ప్రసంగంచేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భద్రతా మండలి రూపుదిద్దుకుందని గుటెర్రెస్ పేర్కొన్నారు. ‘కానీ అప్పటి నుంచి ప్రపంచం ప్రాథమికంగా మారిపోయింది. ఆ మార్పు భద్రతా మండలిలో ఏమాత్రం ప్రతిబింబించడం లేదని తెలిపారు. ఆఫ్రికాకు శాశ్వత ప్రాతినిథ్యం(Permanent representation) లేని 21వ శతాబ్దపు భద్రతా మండలి అన్యాయమైనది, సమర్థనీయం కానిది.
ఇది మారాలి అని ఆయన అన్నారు. ఈ మాటలకు యూఎన్‌జీఏ హాలులోని నాయకులు చప్పట్లతో మద్దతు తెలిపారు. దాదాపు 35 నిమిషాల పాటు సాగిన తన చివరి ప్రసంగాన్ని ముగించి పోడియం నుంచి బయటకు వస్తున్నప్పుడు, ప్రపంచ నాయకులు, విదేశాంగ మంత్రులు, రాయబారులు, దౌత్యవేత్తలు, సీనియర్ యూఎన్ అధికారులు గుటెర్రెస్‌కు లేచి నిలబడి అభినందనలు తెలిపారు. ‘ప్రపంచ పాలనకు సంబంధించిన మన సంస్థలు మరియు వ్యవస్థలు ఇప్పటికీ గత కాలపు అధికార వాస్తవాలను మరియు ప్రయోజనాలను ప్రతిబింబిస్తున్నాయి.
మన ముందున్న ప్రధాన సవాలు ఇదే. మానవాళి అపూర్వమైన ముప్పుల సమ్మేళనాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, సమిష్టి చర్యల కోసం మనకున్న యంత్రాంగాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి అని ఆయన అన్నారు. 15 దేశాల భద్రతా మండలిని సంస్కరించాలన్న గుటెర్రెస్ పిలుపు, ఆయన చేసిన అత్యంత బలమైన పిలుపులలో ఒకటిగా నిలిచింది.
తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ విభజనలు, అధికమవు తున్న అసమానతలు, క్షీణిస్తున్న విశ్వాసం పట్ల గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి అధినేతగా సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ తన రెండో పదవీకాలం డిసెంబర్ 2026లో ముగుస్తుంది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో అత్యున్నతస్థాయి సమావేశాల వారంలో ఆయన పాల్గొనడం ఇదే చివరిసారి.