వీఓఏల సమస్యలు పరిష్కరించాలి...

22-09-2026 | 10:32pm

- కనీస వేతనం రూ.26 వేలు ఉద్యోగ భద్రత కల్పించాలి

- ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు వినతి

మునుగోడు, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మహిళా అభ్యున్నతితోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకంగా పనిచేస్తున్న గ్రామ సంఘాల సహాయకులు (వీఓఏ) సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మునుగోడు మండల వీఓఏల కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanti Satyam)కు వినతిపత్రం అందజేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పరిధిలో గ్రామస్థాయిలో సుమారు 17,606 మంది వీఓఏలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత 26 ఏళ్లుగా గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు, మహిళలకు ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై అవగాహన కల్పించడం, చిన్న వ్యాపారాలకు రుణాలు అందేలా చూడటం వంటి కార్యక్రమాల్లో వీఓఏలు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు.డ్వాక్రా మహిళా సంఘాల లావాదేవీల నిర్వహణ, పుస్తకాల నిర్వహణ, సమావేశాల నిర్వహణ, ఆన్‌లైన్‌ ఎంట్రీలు, వివిధ ప్రభుత్వ సర్వేలు, సంక్షేమ పథకాల అమలులోనూ వీఓఏలు సేవలందిస్తున్నారని వివరించారు. గ్రామ సంఘాల పుస్తక నిర్వహణ కోసం ఎంపిక చేసినప్పటికీ ప్రస్తుతం అనేక రకాల పనులను తమతో చేయిస్తున్నారని పేర్కొన్నారు.

వీఓఏలకు ప్రస్తుతం నెలకు రూ.5 వేల గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఈ మొత్తంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం లేకపోవడంతో వీఓఏలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.వీఓఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సెర్ప్‌ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు అందించాలని కోరారు. ప్రతి వీఓఏకు నెలకు రూ.26 వేల కనీస వేతనం వ్యక్తిగత బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి వీఓఏకు రూ.10 లక్షల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు.

అర్హత కలిగిన వీఓఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలని, గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా వేతనాలు చెల్లించాలని, అందరికీ ఒకే రకమైన యూనిఫాం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామ సంఘానికి ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.

వీఓఏల సమస్యలను ఎమ్మెల్సీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంగం అధ్యక్షులు పిట్టల రఘు, దొడ్డి రవి ,జనిగల ముత్యాలు, వనం వెంకన్న, ఆమంచ ఇందిరమ్మ, అహల్య, రిజ్వాన ,తులసి, సునీత ఉన్నారు.

మరిన్ని వార్తలు