క్షణికావేశంలో ప్రాణాల మీదకు
* ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
* ఎందుకు మద్యం తాగావని భార్య అడగడంతో
పాపన్నపేట,సెప్టెంబర్20: క్షణికావేశంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మల్లంపేట(Mallampeta) గ్రామ శివారులో ఆదివారం వెలుగుచూసింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. మల్లంపేట గ్రామానికి చెందిన కోరబోయిన సాయిలు(koraboyina sayilu)(41) చేపలు పడుతూ జీవితం గడుపుతున్నాడు. గత కొన్ని రోజులుగా పని చేయకుండా ఖాళీగా ఉండడంతో అప్పులయ్యాయి. కాగా శనివారం మధ్యాహ్నం సమయంలో సాయిలు మద్యం సేవించి ఇంటికి రాగా భార్య నాగరాణి ఎందుకు మద్యం తాగావని అడగడంతో కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
క్షణికావేశంలో గ్రామ శివారులో ఉన్న నర్సాద్రి కుంట సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నాగరాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.