4 August, 2026 | 3:11 AM

బాలికపై లైంగిక దాడి

04-08-2026 01:37 AM

తల, ముఖాన్ని చిదిమేసి.. ఇనుప రాడ్డు చొప్పించి హత్య

అసోంలోని హైలాకండి జిల్లాలో ఘటన

ఐదుగురి నిందితుల అరెస్ట్ 

దిస్పూర్, ఆగస్టు 3: అసోం రాష్ట్రంలోని హైలాకండి జిల్లాలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. బాలిక మొహాన్ని చిదిమేసి, ఆమె ప్రైవేట్ పార్ట్‌లో ఇనుపరాడ్ చొప్పించి, అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ ఘోరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు సమీపంలోని బంధువుల ఇంట్లో జరిగిన విందుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి బాలిక ఇంట్లో గుర్తుపట్టలేని స్థితిలో విగతజీవిగా కనిపించింది.

ఈ కేసులో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. హైలాకండి జిల్లాకు చెందిన బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సమీపంలోని బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్లింది. అయితే ఆ విందులో కజిన్‌తో గొడవ కావడంతో బాలిక ఇంటికి తిరిగి వచ్చేసింది. కాసేపటి తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చారు. తలుపులు తీసి చూసే సరికి ఆ బాలిక విగతజీవిగా పడి ఉంది.

ఆ బాలిక తల, మొహం గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. ఆమె వ్యక్తిగత అవయవాల్లోకి ఇనుప రాడ్డును చొప్పించి పాశవికంగా హత్య చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.

పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే నిజానిజాలు స్పష్టమవుతాయని హైలాకండి జిల్లా పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కట్లిచెర్రా పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని జాతీయ రహదారిని దిగ్బంధించారు.