7 September, 2026 | 9:26 AM

జేఎన్‌యూలో లైంగిక వేధింపులు?

07-09-2026 | 05:20am

నెలక్రితమే ఐసీసీకి ఫిర్యాదు చేసిన 10 మంది విద్యార్థినులు

విచారణ కొనసాగిస్తున్న కమిటీ

నోరు మెదపని విశ్వవిద్యాలయ వర్గాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రొఫెసర్‌పై జేఎన్‌యూ(Jawaharlal Nehru University) విద్యార్థినుల లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. నెలక్రితమే విద్యార్థినులు విశ్వవిద్యాలయ ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)కి ఫిర్యాదులు చేసినా విషయం ఆదివారం బయటకు పొక్కింది. 10 మంది విద్యార్థినులు చేసిన ఫిర్యాదు.. ప్రకారం సదరు ప్రొఫెసర్ సమావేశాలు, పాఠాల పేరిట విద్యార్థినులను తమ నివాసానికి పిలిపించి అక్కడ వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారని పేర్కొన్నారు.

తరగతులు నిర్వహించే సమయంలో కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. నెలరోజుల క్రితం అందిన ఫిర్యాదులపై విచారణ ప్రారంభించామని ఐసీసీ అధికార వర్గాలు ప్రకటించాయి. కమిటీ దర్యాప్తులో పూర్వ విద్యార్థుల నుంచి కూడా సమాచారం సేకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయంపై విశ్వవిద్యాలయం కమిటీకి తప్ప పోలీసు ఫిర్యాదు దాఖలైనట్లు సమాచారం లేదు. కాగా పూర్తి దర్యాప్తు అనంతరమే మిగతా వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై జేఎన్‌యూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరిన్ని వార్తలు