36 శాతానికి పైగా లాభాల వాటా చెల్లించాలి

04-10-2026 | 08:40pm

 నాగెల్లి వెంకటేశ్వర్లు

మణుగూరు, అక్టోబర్ 4(విజయ క్రాంతి ): సింగరేణి కార్మికులకు(Singareni workers) పీఎల్ఆర్ బోనస్‌లో(PLR bonus) అన్యాయం జరిగిందని ఏరియా టిబిజికెఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు(Nagelli Venkateswarlu) ఆరోపించారు. ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్(Prakasam Khani Opencast)-2ను సందర్శించిన ఆయన కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలకత్తాలో జరిగిన సమావేశంలో రూ.1,10,250 లాభాల ఆధారిత బోనస్‌కు ఒప్పందం కుదుర్చుకోవడం కార్మికుల శ్రమకు తగిన విలువ కాదన్నారు.

గతంలో రూ.1.20 లక్షలకు పైగా బోనస్ సాధిస్తామని హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడు తక్కువ మొత్తానికి ఎందుకు ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2025-26లో బోనస్ పెరగాల్సి ఉండగా రూ.7,250 తగ్గడం కార్మికుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమన్నారు. సింగరేణి వాస్తవ లాభాల నుంచి కార్మికులకు 36 శాతానికి పైగా లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్‌పై టిబిజికెఎస్ ఆధ్వర్యంలో దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సోమవారం అన్ని గనులు, డిపార్ట్‌మెంట్ల అధికారులకు, మంగళవారం జనరల్ మేనేజర్లకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు.స్పష్టమైన ప్రకటన రాకపోతే సింగరేణి భవన్ ముట్టడి వంటి తదుపరి ఆందోళనలు చేపడతామని నాగెల్లి హెచ్చరించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు