వ్యవసాయ మోటార్లకు లో వోల్టేజ్‌ సమస్య

04-10-2026 | 09:33pm

351 వోల్టులకే పరిమితమవుతున్న విద్యుత్తు.. మోటార్లు తిరగక రైతుల ఇబ్బందులు

కన్నాయిగూడెం, అక్టోబరు 4 (విజయక్రాంతి): కన్నాయిగూడెం మండలం(Kannaigudem Mandal)లోని పలు గ్రామాల్లో వ్యవసాయ విద్యుత్తుకు లో వోల్టేజ్‌ సమస్య(Low voltage Problem) తలెత్తడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రీ-ఫేజ్‌ సరఫరాలో సుమారు 415 వోల్టుల విద్యుత్తు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 351 వోల్టుల వరకు మాత్రమే సరఫరా అవుతోందని రైతులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వోల్టేజ్‌ మీటర్‌ రీడింగ్‌ను రైతులు చూపిస్తున్నారు. 

లో వోల్టేజ్‌ కారణంగా వ్యవసాయ మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని, తరచూ ట్రిప్‌ అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. దీంతో మోటార్లు వేడెక్కి కాలిపోయే పరిస్థితి ఏర్పడుతోందని, మోటార్ల మరమ్మతులు, మార్పిడికి అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు కీలకంగా ఉన్న సమయంలో లో వోల్టేజ్‌ సమస్యను వెంటనే పరిష్కరించి, స్థిరమైన విద్యుత్తు సరఫరా చేయాలని రైతులు విద్యుత్‌ అధికారులను కోరుతున్నారు.

జర్నలిస్టుపై దుర్భాషలాడిన లైన్‌మెన్‌పై చర్యలు తీసుకోవాలి

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే జర్నలిస్టుల బాధ్యత

లో వోల్టేజ్‌, విద్యుత్‌ సరఫరా సమస్యలపై వార్త రాసిన విలేకరిపై సంబంధిత లైన్‌మెన్‌ దుర్భాషలాడిన ఘటనపై పలువురు జర్నలిస్ట్‌ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని, వాస్తవాలను నిర్భయంగా రాసినందుకు విలేకరిని దూషించడం సరికాదని పేర్కొన్నారు.

రైతులు విద్యుత్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ సమస్యలను వార్తగా ప్రచురించడం తప్పా? అని పలువురు వర్కింగ్‌ జర్నలిస్టులు ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని ఖండించారు.

విలేకరిపై దుర్భాషలాడిన సంబంధిత లైన్‌మెన్‌పై విద్యుత్‌ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్‌ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. చర్యలు తీసుకోకపోతే మండల, జిల్లా స్థాయి జర్నలిస్ట్‌ సంఘాలతో కలిసి తదుపరి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు