మండల దివ్యాంగుల సంఘం అధ్యక్షుడిగా కావట్టి బాలరాజు
మహమ్మదాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మహ్మదాబాద్ మండల అధ్యక్షుడిగా కావట్టి బాలరాజు(Kavatti Balaraju) ఏకగ్రీవంగా నియమితులయ్యారు. తెలంగాణ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతురాజు సుధీర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాలరాజుకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు కావట్టి బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని, అర్హులైన దివ్యాంగులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పించాలని, నాలుగు శాతం రిజర్వేషన్‌ను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ప్రతి దివ్యాంగుడికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మండల అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన మహ్మదాబాద్ మండల దివ్యాంగులందరికీ, జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్‌తో పాటు సంఘం నాయకులు, సభ్యులకు బాలరాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
నూతన కమిటీ
మహ్మదాబాద్ మండల దివ్యాంగుల సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కావట్టి బాలరాజు, ఉపాధ్యక్షుడిగా చింతకింది శ్రీనివాస్, కార్యదర్శిగా కోర శంకర్ నాయక్, సహాయ కార్యదర్శిగా ఇర్లలపల్లి కృష్ణయ్య, కోశాధికారిగా బోయిని కృష్ణయ్య, మీడియా కన్వీనర్‌గా బట్టు రాఘవేందర్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చుక్కయ్య, వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు అనేము గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఊరడి హన్మంత్, జిల్లా సలహాదారు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.