కుటుంబ కలహాలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ఘట్ కేసర్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : కుటుంబ కలహాలతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య(Suicide) చేసుకున్న సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్(IT Corridor Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారం సంస్కృతి టౌన్షిప్ సమీపంలో ఉన్న గెలాక్సీ టవర్స్ అపార్ట్మెంట్లో ఐటీ ఉద్యోగిని మౌనిక సంతోషి (31) ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురానికి చెందిన మౌనిక సంతోషి (ఐటీ ఉద్యోగి), విశాఖపట్నం కు చెందిన రమాకాంత్ (ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగి) వీరు 8 సంవత్సరాల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. వీరికి 2.5 ఏళ్ల వయసున్న కవల మగపిల్లలు ఉన్నారు.
గత కొన్నిరోజులుగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు, గొడవలు జరుగుతున్నట్లు, శనివారం ఉదయం కూడా వీరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. శనివారం రాత్రి మౌనిక సంతోషి గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో తలుపులు తెరిచి ఉండటంతో పనిమనిషి వచ్చి చూడగా, మౌనిక ఉరివేసుకొని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. భర్త వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తల్లి మరణంతో 2.5 ఏళ్ల కవల పిల్లలు తల్లిని కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.