నిమజ్జనం మాటున మట్టి దందా!

23-09-2026 | 05:20am
  1. కేఎల్‌ఐ కాల్వ నుంచి రాత్రికి రాత్రే భారీగా మట్టి తరలింపు  
  2. పట్టించుకోని అధికారులు

కల్వకుర్తి, సెప్టెంబర్ 23: వినాయక నిమజ్జన(Vinayaka Immersion) ఏర్పాట్ల పేరుతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(Kalwakurthy Lift Irrigation Scheme) (కెఎల్‌ఐ) కాల్వ పక్కన ఉన్న మట్టిని అక్రమంగా తరలించడం కల్వకుర్తిలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలోని సిలార్పల్లి వార్డు సమీపంలోని కెఎల్‌ఐ కాల్వ నుంచి సోమవారం నుంచి రాత్రింబవళ్లు టిప్పర్ల ద్వారా మట్టిని(Soil) తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 100 టిప్పర్ల వరకు మట్టి తరలించినట్లు వారు చెబుతున్నారు. ఈ మట్టిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి బినామీ భాగస్వామికి చెందిన వెంచర్లో రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్ష నాయకులు, స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

కలిసొచ్చిన వినాయక చవితి..

ఇటీవల ఓ భూ సెటిల్మెంట్కు సంబంధించి వెంచర్ ఏర్పాటు చేసిన అధికార పార్టీ నాయకుడికి ఈ వ్యవహారం కలిసొచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంచర్లో రోడ్డు నిర్మాణానికి అవసరమైన మట్టిని వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్ల పేరుతో తరలించుకునే అవకాశం లభించిందని వారు అంటున్నారు. తమ కాలనీకి ఏళ్లుగా రోడ్డు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నా పట్టించుకోలేదని, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు తెలిపారు. అయితే ఒక్కసారిగా రాత్రికి రాత్రే మట్టితో రోడ్డు ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు

కాల్వల నిర్వహణ, అత్యవసర పనులకు ఉపయోగపడే మట్టిని రాత్రివేళల్లో ఎందుకు తరలిస్తున్నారంటూ ప్రతిపక్ష వార్డు నాయకులు ప్రశ్నించడంతో అధికార పార్టీ నాయకులతో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం ఇరు వర్గాల నాయకులు పోలీస్స్టేషన్కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. 

ఎవరి బాధ్యత?

మట్టి తరలింపుపై మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా.. వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి ఆన్లైన్ టెండర్ నిర్వహించి, టెండర్ నిబంధనల ప్రకారమే పనులు చేపట్టామని తెలిపారు. మట్టి అక్రమ తరలింపుతో మున్సిపాలిటీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులను సంప్రదించగా.. మట్టి తరలింపు విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. తమ అనుమతులు లేకుండా మట్టి తరలించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

నిమజ్జనం కాంట్రాక్టర్‌కు సంబంధం లేదట!

మరోవైపు నిమజ్జన ఏర్పాట్ల కాంట్రాక్టర్ స్పందిస్తూ.. తమకు అప్పగించిన పనులన్నీ రెండు రోజుల ముందే పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మట్టి తరలింపుతో నిమజ్జన ఏర్పాట్లకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం మట్టిని ఎందుకు తరలిస్తున్నారో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం మునుముందు ఎంతవరకు వెళ్తుందో అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు