డర్బన్‌లో మారణహోమం
డర్బన్: దక్షిణాఫ్రికాలోని డర్బన్ టౌన్షిప్(Durban Township)లో మంగళవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి సాయుధ దుండగులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో గర్భిణితో సహా 11 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలతో బయటపడ్డారు. క్వాజులు-నటాల్ ప్రావిన్స్ అధికారులు ఈ ఘటనను ధ్రువీకరించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఇంట్లో ఉన్న వారిని దుండగులు ఒక గదిలోకి తీసుకెళ్లి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో గర్భిణి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు
ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన ఈ దారుణ ఘటనకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా వెల్లడికాలేదు. దాడి వెనుక ఉన్న ఉద్దేశం, నిందితుల సంఖ్య, వారి ఆచూకీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.