సరస్వతినగర్లో వినాయక మండపాల వద్ద ఆధ్యాత్మిక శోభ, నిత్యాన్నదానం,ప్రముఖులతో ప్రత్యేకపూజలు
బోధన్ సెప్టెంబరు 19 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని 35వ వార్డు సరస్వతి నగర్ లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మిమ్స్ డిగ్రీ కళాశాల (MIMS Degree College) వెనుక గల శ్రీ రాజరాజేశ్వరి గణేష్ మండలి వారు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. 12 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన ఈ గణనాథుని ఎదుట నిర్వహకులు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పుష్పార్చన, కుంకుమార్చన వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే కాలనీవాసులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాలకు చెందిన భజనమండలి భక్తులతో అర్ధరాత్రి వరకు భజనలు కీర్తనలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న భక్తి కార్యక్రమాలకు వివిధ ప్రభుత్వ రంగాలకు చెందిన ముఖ్యమైన అధికారులు కూడా ఇక్కడికి విచ్చేసి వినాయకుడికి పూజలు చేసి భక్తి పారావశ్యాన్ని చాటుతున్నారు.
కమిటీ నిర్వహకులు ప్రతి రోజు రాత్రి వేల గణేష్ మండపం వద్ద మండలి సభ్యులు రోజుకు ఒకరు చొప్పున అన్నప్రసాద వితరణ చేపడుతున్నారు. కాలనీకి చెందిన భక్తులు ,చిన్నారులు, మహిళలందరూ ఇక్కడికి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ గణపతి నవరాత్రుల ప్రత్యేకతను చాటుతున్నారు.
బోధన్ ఆర్డీవో విజయ కుమారి సైతం నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. అన్న ప్రసాద వితరణ చేపట్టి భక్తులతో కలిసి భోజనం చేశారు. ఐదు రోజులపాటు అన్నప్రసాద వితరణ విజయవంతం అయ్యిందని దీనిని వినాయక నిమజ్జనం వరకు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. మరి కొంతమంది ఆధ్యాత్మిక స్వామీజీలను కూడా ఇక్కడికి రప్పించి ప్రవచనాలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నామని వారు పేర్కొన్నారు.