నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

18-09-2026 | 10:36am

ముంబై: ముడి చమురు ధరలు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి మధ్య శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో ప్రధాన ఈక్విటీ సూచీలు(Equity indices) సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల BSE సెన్సెక్స్ 162.87 పాయింట్లు పెరిగి 74,483.56కు చేరింది. 50 షేర్ల NSE నిఫ్టీ 43.90 పాయింట్లు పెరిగి 23,315.25 వద్ద నమోదైంది. 30 సెన్సెక్స్ సంస్థలలో భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel), ఎటర్నల్, లార్సెన్ & టుబ్రో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్(Adani Ports) ప్రధానంగా లాభపడ్డాయి. రూ.25,000 కోట్ల విలువైన వాటాల విక్రయ ప్రణాళికను SP గ్రూప్ ప్రకటించిన తర్వాత టాటా గ్రూప్ షేర్లు(Tata Group shares) పడిపోయాయి. ఉదయం 9:40 గంటల సమయానికి, టాటా కెమికల్స్ షేర్లు 7.8శాతం వరకు పడిపోగా, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ 3.9శాతం క్షీణించింది. అలాగే, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 2.6శాతం, టాటా పవర్ 1.4% మేర నష్టపోయాయి.

ఈ వారంలో ఇప్పటివరకు నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 0.5శాతం, 0.6శాతం మేర తగ్గుముఖం పట్టాయి. తద్వారా ఇవి వరుసగా ఆరవవారం కూడా నష్టాన్ని నమోదు చేసే దిశగా పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9:59 గంటలకు, నవంబర్ బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ 0.93 శాతం తగ్గి 103.85 డాలర్ల వద్ద, అలాగే WTI (వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్) అక్టోబర్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ 0.62 శాతం తగ్గి 101.28 డాలర్ల వద్ద ఉన్నాయి. గురువారం 23,270.60 వద్ద ముగిసిన బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 సూచీ సానుకూల ప్రారంభాన్ని సూచిస్తూ, శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT Nifty) ఫ్యూచర్స్ సుమారు 23,329.5 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు