నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్‌లో శివ భజన కార్యక్రమం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్(Nagireddypet Police Station) ఆవరణలో బొల్లారం గ్రామానికి చెందిన శివ భజన బృందం సభ్యుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ... పండుగల సమయంలో డీజేలు, అధిక శబ్దాలతో కూడిన కార్యక్రమాల కంటే భజనలు, సాంప్రదాయ కళా కార్యక్రమాలు ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయని తెలిపారు. శివ భజన బృందం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా డీజే వల్ల కలిగే ఆనందం కంటే మరింత ఎక్కువగా ప్రశాంతమైన, ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందడం జరిగిందని ఎస్‌ఐ భార్గవ్ గౌడ్(SI Bhargav Goud) పేర్కొన్నారు.
పండుగల సందర్భంగా డీజేలను ఏర్పాటు చేయకుండా భజన బృందాలు, సాంప్రదాయ కళాకారులు,కళా ప్రదర్శనలు నిర్వహించే కళాకారులను ప్రోత్సహించాలని ఆయన నాగిరెడ్డిపేట్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా యువతలో సాంప్రదాయ కళల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు, పండుగల యొక్క అసలైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రజలందరూ పోలీసు శాఖ సూచనలు,నిబంధనలను పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్.ఐ భార్గవ్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, శివ భజన బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.