ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం
కాంగ్రెస్ హామీల అమలుకు దశలవారీ ఆందోళనలు
రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం
దోమకొండ,సెప్టెంబర్ 3(విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రతిపక్ష హోదాలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(MLA Gampa Govardhan), మాజీ ఎమ్మెల్సీ(Former MLC), ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వి.జి.గౌడ్(Incharge V.G. Goud) అన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దోమకొండలోని పెద్దమ్మ గుడి వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ రైతు సదస్సులో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
దశలవారీగా ఆందోళనలు
ప్రభుత్వంపై వివిధ దశల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు. సోమవారం అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో కాంగ్రెస్ 420 హామీల అమలుపై సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని కార్యకర్తలకు సూచించారు. ఈనెల 4న బీబీపేట మండల కేంద్రంలో మహిళల ఆధ్వర్యంలో, 5న కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో విద్యార్థులు, యువతతో ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు.
7న మాచారెడ్డిలో నిరసన కార్యక్రమం, 8న ప్రతి గ్రామం, మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. 10న కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అరుణ వైకుంఠధామాల్లో పారిశుధ్య పరిస్థితులపై కూడా ఆందోళనలు చేపడతామని తెలిపారు.
యూరియా కోసం రైతుల ఆరాటం
రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గంప గోవర్ధన్, వి.జి.గౌడ్ ఆరోపించారు. యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని అన్నారు. మక్కలు కొనుగోలు చేసేందుకు సరైన ఏర్పాట్లు లేక రైతులు ఆందోళన చెందుతున్నారని మండలాల పార్టీ అధ్యక్షులు పేర్కొన్నారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన పాలన సాగిస్తోందని ఆరోపించారు.
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలని గంప గోవర్ధన్ కార్యకర్తలకు సూచించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చేపడుతున్న పోరాటాలను వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉండి పదవులు, కాంట్రాక్టులు, ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవద్దని మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ ప్రేమ్‌కుమార్ డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, కామారెడ్డి మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ గోదావరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్, మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ ప్రేమ్‌కుమార్, మండల అధ్యక్షుడు గండ్ర మధుసూదన్, మాజీ ఎంపీపీలు బాలమణి, శారద, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, గజవాడ శ్రీకాంత్, బోరెడ్డి కిషన్, పాలకుర్తి శేఖర్, సంగమేశ్వర్ సర్పంచ్ రావులపల్లి శ్రీనివాసరావు, అంచనూర్ సర్పంచ్ జనగామ నరేష్, అంబర్‌పేట సర్పంచ్ ఆరుట్ల కవిత, అనిల్, సీతారాంపల్లి సర్పంచ్ వెన్నెల భాగ్యశ్రీ, సిద్ధ రాములు, ఆశిశెట్టి పోచయ్య, కుంచాల సత్యనారాయణ, అశోక్, లక్ష్మి, కడారి రమేష్, సాహెబ్‌గారి విజయ్, సుధాకర్‌తో పాటు కామారెడ్డి, దోమకొండ, బీబీపేట, బిక్కనూరు, మాచారెడ్డి, రాజంపేట, పాల్వంచ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






