బకాయిల చట్రంలో విద్యార్థి భవిత
తిప్పర్తి శ్రీనివాస్ :
ఒక పేద కుటుంబం తన బిడ్డ ఉన్నత విద్య(Higher Education) కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. రోజువారీ అవసరాలను తగ్గించుకుని ఫీజుల కోసం డబ్బు సమకూరు స్తుంది. అవసరమైతే అప్పులు చేస్తుంది. బిడ్డ చదివి ఉద్యోగం సంపాదిస్తే కుటుంబ పరిస్థితులు మారుతాయన్న ఆశతో ముం దుకు సాగుతుంది. అలాంటి కుటుంబానికి ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) ఒక సాధార ణ ప్రభుత్వ పథకం కాదు. భవిష్యత్తుపై ఒక ఆర్థిక భరోసా. అది సకాలంలో అందకపోతే మాత్రం విద్యార్థి చదువుకే ప్రశ్న ఎ దురవుతుంది.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశం మరోసారి తీవ్ర చర్చకు వచ్చింది. సెప్టెంబర్‌లో వెలువడిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం బకాయిలు రూ.8,591.63 కోట్లు అని అసెంబ్లీలో(Assembly) మంత్రి వెల్లడించారు. 2023-24 నుంచి 2025-26 వరకు డిమాండ్ చేసిన రూ.7,673.78 కోట్లలో కేవలం రూ.2,160.03 కోట్లు మాత్రమే విడుదల కాగా, రూ.5,513.75 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ లెక్కలు సమస్య చిన్నది కాదని స్పష్టం చేస్తున్నాయి. అయి తే, బకాయిలు ఎంత అన్నది పక్కన పెడితే ఆ ప్రభావం విద్యార్థి భవిష్యత్తుపై ఎంత పడుతోంది? అతని చదువు, పరీక్షలు, సర్టిఫికెట్లు, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత కూడా ఫీజు బకాయిల పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటే, సంక్షే మ పథకం లక్ష్యమే ప్రశ్నార్థకమవుతుంది.
మరోవైపు విద్యాసంస్థల సమస్యను కూడా విస్మరించలేం. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల ఫీజులపై ఆధారపడి సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మౌలిక సదుపా యాలు, ఇతర నిర్వహణ ఖర్చులను భరిస్తాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధు లు ఆలస్యమైతే కళాశాలల ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇటీవలి కాలంలో విద్యార్థులు, కళాశాలలు రెండూ బకాయిల విడుదల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందువల్ల ఈ సమస్యను కేవలం విద్యార్థి వర్సెస్ కళాశాలగా చూడ టం సరైంది కాదు. ప్రభుత్వం, విద్యాసంస్థ, విద్యార్థి మూడు వర్గాల ప్రయోజనాలను సమన్వయం చేసే వ్యవస్థ అవసరం.
అయితే ప్రభుత్వం, కళాశాల మధ్య ఆర్థిక లావాదేవీలకు విద్యార్థి మూల్యం చెల్లించకూడదు. ముఖ్యంగా ఒరిజినల్ సర్టిఫికెట్ల విషయంలో ఇది అత్యంత కీలకమైన అంశం. ఒక విద్యార్థి కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యకు వెళ్లాలన్నా, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నా, పోటీ పరీక్షకు హాజరుకావాలన్నా లేదా ఇతర విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నా సర్టిఫికెట్లు అవసరం. వాటి కోసం విద్యార్థి ఆర్థిక ఒత్తిడిలో పడటం అతని భవిష్యత్తుకు మరో అడ్డంకిగా మారుతుంది.
ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇటీవల స్పష్టమైన దృక్పథాన్ని వెల్లడించింది. ఆగస్టు 17, 2026న ఒక బీ ఫార్మసీ విద్యా ర్థి కేసులో, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభు త్వం నుంచి రావాల్సి ఉందనే కారణంతో విద్యార్థి ఒరిజినల్ విద్యా ధ్రువపత్రాలను కళాశాల లేదా విశ్వవిద్యాలయం నిలుపుదల చేయడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది. విద్యార్థి సర్టిఫికెట్లు అతని వ్యక్తిగత, విద్యా ఆధారాలు అని, బకాయిల వసూలుకు వాటిని భద్రతగా ఉంచడం సరైన మార్గం కాదని స్పష్టం చేసి, సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
ఈ పరిణామం ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. ఆర్థిక వివాదానికి పరిష్కారం ఆర్థిక మార్గంలోనే ఉండాలి. విద్యార్థి సర్టిఫికెట్లు ఒత్తిడి సాధనంగా మారకూడదు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలుంటే ప్రభుత్వం, కళాశాలలు వాటిని పరిపాలనా లేదా చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలి. విద్యార్థి భవిష్యత్తును మధ్యలో పెట్టి వివాదాన్ని కొనసాగించడం వల్ల సమస్య మరింత సంక్లిష్టమవుతుంది.
ఇదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం కూడా అత్యవసరం. ప్రజల ప న్నుల నుంచి వచ్చే నిధులు కావడంతో ప్రతి రూపాయి అర్హత ఉన్న విద్యార్థికే చేరా లి. బోగస్ అడ్మిషన్లు, తప్పుడు హాజరు, నకిలీ పత్రాలు, అర్హత లేని క్లెయిములు వంటి అక్రమాలకు అవకాశం ఉండకూడదు. అక్రమాలను అరికట్టే క్రమంలో నిజ మైన విద్యార్థి ఇబ్బంది పడకూడదు. ఇందుకోసం సాంకేతిక ఆధారిత పరిశీలన, డిజిటల్ రికార్డులు, సమయపాలనతో కూ డిన ధృవీకరణ వ్యవస్థ అవసరం.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2026 విద్యా సం వత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం లో విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేసే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం సంవత్సరమంతా దరఖా స్తులు స్వీకరించే విధానం, వివిధ దశల్లో రీయింబర్స్‌మెంట్ విడుదలకు గడువులు, తదుపరి సంవత్సరాల్లో అర్హులైన విద్యార్థులకు ఆటో- రెన్యూవల్ వంటి అంశాలను ప్రవేశపెట్టారు.
కొత్త విధానంలో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు నమోదైన అర్హులైన విద్యార్థులకు ఆగస్టు 15లోపు, ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు నమోదైన వారికి డిసెంబర్ 30లోపు, డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు నమోదైన వారికి ఫిబ్రవరి 28లోపు నిధులు విడుదల చేసే విధంగా కాలపట్టికను నిర్దేశించారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు వచ్చే దర ఖాస్తులకు 75 రోజుల్లో చెల్లింపు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇది గతంలో ఉన్నా ‘ఎప్పుడు వస్తాయో తెలియని బకాయిలు’ అనే పరిస్థితిని మార్చే ప్రయత్నంగా చూడవచ్చు.
కానీ కొత్త విధానం విజయవంతం కావాలంటే పాత బకాయిల పరిష్కారం కూడా అంతే ము ఖ్యమైనది. గత సంవత్సరాల బకాయిలు పేరుకుపోతూ ఉంటే, కొత్త వ్యవస్థకు కూడా భవిష్యత్తులో ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం పాత బకాయిలకు స్పష్టమైన చెల్లింపు ప్రణాళికను ప్రజలకు వెల్లడించాలి. ఇదే విషయం పై తెలంగాణ హైకోర్టు కూడా గతంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన చెల్లింపు కాలపట్టిక కోరింది. 2026 మేలో కోర్టు, విద్యా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను ఎ ప్పుడు, ఎలా పరిష్కరిస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరింది.
అనంతరం జూ లైలో ప్రభుత్వం నిర్దిష్ట గడువులో బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇవ్వడం తో కోర్టు సంబంధిత అంశాలపై తన మధ్యంతర ఆదేశాల్లో మార్పులు చేసింది. అయితే ఆ తర్వాత కూడా పాత బకాయిలపై విద్యార్థులు, కళాశాలలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆగస్టులో వచ్చిన నివేదికలు ముఖ్యంగా చివ రి సంవత్సరం విద్యార్థులు సర్టిఫికెట్లు, తదుపరి విద్య, ఉద్యోగ దరఖాస్తుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాయి.
అందువల్ల ఇప్పుడు అవసరమైనది మరో హామీ కాదు. ఒక స్థిరమైన వ్యవస్థ. ఫీజు రీయింబర్స్‌మెంటుకు విద్యా సంవత్సరంతో అనుసంధానమైన ఆర్థిక క్యాలెండర్ ఉండాలి. అర్హత నిర్ధారణకు ఒక గడువు, మంజూరుకు ఒక గడువు, చెల్లింపుకు ఒక గడువు ఉండాలి. విద్యార్థి తన దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే దానికి కారణం స్పష్టంగా తెలియాలి. ఫిర్యాదు చేస్తే నిర్ణీత సమయంలో పరిష్కారం లభించాలి.
ప్రభుత్వానికి ఆర్థిక పరిమితులు ఉంటాయి. ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగుల జీతాలు, మౌలిక వసతులు అన్నింటికీ నిధులు అవసరం. అయినప్పటికీ విద్యపై చేసే ఖర్చును కేవలం వ్యయంగా చూడకూడదు. అది మానవ వనరులపై పెట్టుబడి. ఒక విద్యార్థి ఉన్నత విద్య పూర్తిచేసి ఉద్యోగం పొందితే అతని కుటుంబ ఆర్థిక స్థితి మాత్రమే కాదు, సమాజంలో అతని భాగస్వామ్యం కూడా మారుతుంది. అదే సమయంలో కళాశాలల బాధ్యత కూడా ఉంది.
ప్రభుత్వ రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడుతున్నామని చెప్పి రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదు. విద్యార్థుల హాజరు, అడ్మిషన్, ఫీజు, సిబ్బంది వివరాలు సక్రమంగా నిర్వహించాలి. ప్రభుత్వ నిధులను పొందేందుకు తప్పుడు వివరాలు సమర్పించే సంస్థలపై చర్యలు ఉండాలి. నిజా యితీగా విద్య అందిస్తున్న సంస్థలు మాత్రం చెల్లింపుల ఆలస్యంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురికాకుండా ప్రభుత్వం తన వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలి.
ఇందులో విద్యార్థుల బాధ్యత కూడా ఉంది. అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించడం, బ్యాంకు ఖాతా వివరాలను సరిగా ఉంచడం, హాజరు నిబంధనలు పాటించడం వంటి విషయాల్లో వారు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలి. కళాశాలలు తమ బాధ్యతను నిర్వర్తించాలి. విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. పథకం అసలు ఉద్దేశం విద్యార్థిని తరగతి గదిలో ఉంచడం. బకాయిల కోసం విద్యార్థి పోరాడాల్సిన పరిస్థితి కాకుండా తన చదువు, నైపుణ్యం, భవిష్యత్తుపై దృష్టి పెట్టే పరిస్థితి కల్పించడమే వ్యవస్థ విజయానికి అసలైన కొలమానం.
అందుకే ఇప్పుడు చర్చ ‘ఎవరి కాలంలో ఎంత బకాయి?’ అనే రాజకీయ లెక్కల దగ్గరే ఆగిపోకూడదు. ‘ఇకపై బకాయిలు పేరుకుపోకుండా ఎలా చూడాలి?’ అన్న ప్రశ్నకు సమాధానం వెతకాలి. గత బకాయిలను పరిష్కరించడం, కొత్త బకాయిలు రాకుండా చూడటం, విద్యార్థుల సర్టిఫికెట్లను రక్షించడం, కళాశాలల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం ఈ నాలుగు అంశాలు ఒకే వ్యవస్థలో భాగం కావాలి. విద్యార్థి భవిష్యత్తు ఏ బకాయి ఫైల్లోనూ చిక్కుకోకూడదు. ఆ దిశగా పనిచేసినప్పుడే అసలు లక్ష్యం నెరవేరుతుంది.
- వ్యాసకర్త సెల్
9948439565