ఆర్చరీ జాతీయ స్థాయి పోటీలకు సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాల విద్యార్థి యశ్వంత్ ఎంపిక
సుల్తానాబాద్, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి):సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్షిప్-2026లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి టి. యశ్వంత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి (నేషనల్స్) పోటీలకు ఎంపికయ్యారని కళాశాల స్పోరట్స్ ఇంచార్జ్ సునీల్ సోమవారం తెలిపారు.
అక్టోబర్ 23 నుండి 26 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనున్న జూనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలలో యశ్వంత్ తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.ఈ సందర్భంగా జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థి యశ్వంత్‌ను కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత అభినందించారు.
యశ్వంత్ తన ప్రతిభతో కళాశాలకు, మన ప్రాంతానికి ఎంతో గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. జాతీయ స్థాయి పోటీలలో కూడా ఇదే విధమైన ప్రతిభను చాటి విజయం సాధించాలని, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.