ఎన్నికలా? పొడిగింపా?
- సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలపై ఉత్కంఠ
- ఈనెల 9తో ముగిసిన కాలపరిమితి
- షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు మరో మూడు నెలలు
- కార్మిక శాఖ, యాజమాన్యం నుంచి రాని స్పష్టత
- బరిలోకి దిగేందుకు యూనియన్ల కసరత్తు
- కోల్‌బెల్ట్‌లో 40వేల మంది ఓటర్లు
కరీంనగర్, సెప్టెంబరుర్ 9 (విజయక్రాంతి): సింగరేణి(Singareni)లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తారా, లేదా? అని కార్మికుల్లో ఉత్కంఠ నెలకొంది. 2023 డిసెంబరు 27న జరిగిన ఎన్నికల్లో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. అయితే గెలుపు సాధించాక సుమారు 9 నెలలకు కార్మిక శాఖ 2024 సెప్టెంబర్ 9న గుర్తింపు సంఘ అధికారిక పత్రం అందజేసింది. రెండేళ్ల కాలం ఈ నెల 9వ తేదీతో ముగిసింది. 8వ విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. కార్మిక శాఖ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త లేబర్ కోడ్ల నిబంధనలు, ఓటరు జాబితా రూపకల్పన, పాత లేక కొత్త పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనే అంశాలపై కార్మిక సంఘాల మధ్య చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియపై యాజమాన్యం నుంచి స్పష్ట త రావాల్సి ఉంది.
సకాలంలో జరగని ఎన్నికలు
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గుబులు మొదలైంది. ప్రతి ఎన్నికల సందర్భంలో కార్మిక సంఘాల పదవీకాలం అంశం వివాదాస్పదంగానే మారుతోంది. ఎన్నికలు నిర్వహించే లేబర్ కమిషనర్ అధికారులు ఎన్నికల కాల పరిమితి రెండు సం వత్సరాలుగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించారు. కానీ మరోసారి ఎన్నికలు జరిగేసరికి నాలుగు సంవత్సరాలు, ఆరు సంవత్సరాల వరకు గెలిచిన సంఘం గుర్తింపు సంఘంగానే ఉంటుంది. ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత ప్రతిపక్ష కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించాలని డిమా ండ్ చేస్తాయి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.
ఆలస్యంగా ధ్రువీకరణ పత్రం జారీ
2023 డిసెంబర్‌లో రెండేళ్ల కాలపరిమితి తో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ నియన్ ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘంగా విజయం సాధించింది. దీని ప్రకారం 2025 డిసెంబరులోనే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ,2023 ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత 9 మాసాలకు 2024 సెప్టెంబర్‌లో ఏఐటీ సీకి అధికారికంగా లేబర్ కమిషనర్ గుర్తింపు సంఘంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చింది.
ఏఐటీసీ తమను గుర్తింపు సంఘంగా గుర్తించింది సెప్టెంబర్ 2024 అయినందున ఈ యేడాది సెప్టెంబరు వరకు గుర్తింపు సంఘంగా ఉండాల నేది సంఘం నాయకుల వాదన. దీంతో పాటు గతంలో టీబీజీకేఎస్ రెండుసార్లు విజయం సాధించి ఒక సారి నాలుగేళ్లు, మరో సారి ఆరేళ్లు గుర్తింపు సంఘంగా కొనసాగిందని, తమను కూడా 2028 సెప్టెం బరు వరకు గుర్తింపు సంఘంగా కొనసాగించాలని ఏఐటీసీ పేర్కొంటుంది.
2023 డిసె ంబర్ ఎన్నికల్లో ఐఎన్టీసీ ఆరు ఏరియాల్లో, ఏఐటీయూసీ ఐదు ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘంగా నిలబడి విజయం సాధించాయి. ఆరు ఏరియాల్లో తాము విజయం సాధించినందున తమకే గుర్తింపు ఇవ్వాలని ఐఎన్టీసీ లేబర్ కమిషన్‌తో పాటు అటు సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఐఎన్టీసీ వాదనను యాజమాన్యం కాదన లేని పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదంతోనే గుర్తింపు పత్రం ఏఐటీసీకి దక్కడానికి తొమ్మిది మాసాల ఆ లస్యం జరిగింది. షెడ్యూల్ ప్రకారం మరో మూడు మాసాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
రాజకీయంగా ప్రాధాన్యం
ప్రతి రాజకీయ పార్టీకి సింగరేణిలో అనుబంధ కార్మిక సంఘం ఉండడంతో గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రాధాన్యం సంతరించుకున్నది. సరాసరిగా 11 అసెంబ్లీ నియోజకవ ర్గాలతో పాటు పరోక్షంగా ఉత్తర తెలంగాణలోని సుమారు 25నుంచి 30 అసెంబ్లీ సెగ్మెంట్లను ప్రభావితం చేసే కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజల మనోభావాలు సింగరే ణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ద్వారా వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం అయ్యాయి.
కోల్‌బెల్ట్‌లో సుమారు 40వేల కార్మికులు ఉండటంతో మినీ అసెంబ్లీ ఎన్నికలుగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రధానంగా పెద్దపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే కార్మికుల్లో, అత్య ధికంగా సుమారు 13,000 నుంచి 15,000 మంది ఓటర్లు రామగుండం 1, 2, 3, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ పరిధిలోనే ఉన్నా రు. అయితే సకాలంలోఎన్నికలు నిర్వహిస్తారా, వాయిదా వేస్తూ సాగదీస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
‘గుర్తింపు’ ఎవరికి?
2023 ఎన్నికల్లో ఏఐటీసీ 16,177 ఓట్లు సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. ఐఎన్‌టీసీ 14,178 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఓటర్లలో 37,451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసా రి కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగితే ఫలితాల లెక్కింపు మాత్రమే కాదు.. గుర్తింపు పొందేందుకు మద్దతు శాతం కూడా కీలకంగా మారనుంది.