20 August, 2026 | 1:58 AM

తీపి మాటలే.. చేతల్లో శూన్యం !

20-08-2026 01:07 AM
  1. నిజాం షుగర్స్ పునరుద్ధరణ ఒట్టిదేనా?
  2. వంద రోజుల హామీకి ఏళ్లు గడుస్తున్నా ఏదీ ప్రగతి?
  3. కమిటీల నాన్చుడు.. కన్సల్టెంట్ల వేట  
  4. షుగర్ ఫ్యాక్టరీలపై రియల్ ఎస్టేట్ కన్ను? 
  5. చెరకు రైతుల నోట్లో కార్పొరేట్ మట్టి! 
  6. ఇథనాల్ నెపంతో ప్రైవేటీకరణ కుట్ర? 
  7. ఎన్నికల హామీ ఇచ్చి చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్
  8. బోధన్, మెదక్ రైతాంగం తీవ్ర ఆందోళన

(ఎ.చంద్రశేఖర్ రావు) :

సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 19 (విజయక్రాంతి) : ‘పదవిలోకి రాగానే 100 రోజుల్లో తెరిపిస్తామన్నారు.. సెప్టెంబర్ 17 లోగా పూర్తి చేస్తామన్నారు.. కానీ ఏళ్లు గడుస్తున్నా ఫ్యాక్టరీల గేట్లు మాత్రం తెరుచుకోలేదు. కమిటీల పర్యటనలు, కార్పొరేట్ కన్సల్టెంట్ల నివేదికల పేరుతో కాలయాపన తప్ప క్షేత్రస్థాయిలో నయా పైసా పని జరగలేదు’ ఉత్తర తెలంగాణ రైతాంగం ఆవేదన. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నిజాం షుగర్స్ పునరుద్ధరణపై స్పష్టమైన హామీ ఇచ్చారు.

అధికారంలోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ రంగంలోనే ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం ఏర్పాటై సుదీర్ఘ కాలం గడుస్తున్నా.. నేటికీ ఒక్క యూనిట్ లో కూడా చెరకు క్రషింగ్ ప్రారంభం కాలేదు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని వేసి, బ్యాంకులకు వన్-టైమ్ సెటిల్‌మెంట్ కింద కొంత నిధులు విడుదల చేసినప్పటికీ.. ఆచరణలో ఫ్యాక్టరీలు పునఃప్రారంభం కాలేదు.

కాగా బోధన్, మెదక్, ముత్యంపేట పరిధిలో నిజాం షుగర్స్ సంస్థలకు వేల ఎకరాల అత్యంత విలువైన భూములు ఉన్నాయి. ఫ్యాక్టరీలను నడపడం కంటే.. ఆ భూముల రియల్ ఎస్టేట్ విలువపైనే పాలకులు, కార్పొరేట్ శక్తుల కన్ను పడిందనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. షుగర్ మిల్లుల పునరుద్ధరణను పక్కనబెట్టి, ఇథనాల్ బ్లెండింగ్ ప్లాంట్లుగా మార్చేందుకు కన్సల్టెంట్లను నియమించడం వెనుక పెద్ద ఎత్తున ప్రైవేటు శక్తుల ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలను రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరొందిన బోధన్‌తో పాటు మెదక్ నిజాం షుగర్స్ మూతపడటంతో లక్షలాది మంది రైతులు, వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పొరుగున ఉన్న ప్రైవేటు ఫ్యాక్టరీలకు చెరకు తరలించలేక, రవాణా ఖర్చులు భరించలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యల బాట పట్టారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల నాన్చుడు ధోరణి వీడి, తక్షణమే బడ్జెట్ లో పూర్తిస్థాయి నిధులు కేటాయించి చెరకు క్రషింగ్ ప్రారంభించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అఖిల భారత కిసాన్ సంఘ్, స్థానిక రైతు ఐక్య వేదికలు ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నాయి.

కమిటీల పేర కాలయాపన

ప్రభుత్వం ఓవైపు సాంకేతిక, లీగల్ కసరత్తులు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, బడ్జెట్‌లో దీనికోసం వందల కోట్ల ప్రత్యేక కేటాయింపులు జరపకపోవడం వల్ల ఇవన్నీ కేవలం కాలయాపన చర్యలేనని విపక్షాలు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలు తెరిచే వరకు ఈ చర్యలపై నమ్మకం లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.

పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్‌గా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిజామాబాద్ (బోధన్), మెదక్ రైతు ప్రతినిధులు, కార్మిక సంఘాలతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కమిటీతో సచివాలయంలో ప్రత్యేక సమీక్ష జరిపి, ఫ్యాక్టరీలను కేవలం తెరిపించడమే కాకుండా వాటిని దీర్ఘకాలంలో లాభాల్లోకి ఎలా తీసుకురావాలనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

అయితే ప్రభుత్వం నిజాం షుగర్స్, దక్కన్ షుగర్స్ ఆస్తుల విలువను లెక్కించేందుకు కన్సల్టెంట్‌ను నియమించడం వెనుక అసలు చక్కెర ఉత్పత్తిని కాకుండా, అక్కడ ఇథనాల్ ప్లాంట్లు పెట్టి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే వ్యూహం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో చక్కెర పరిశ్రమలుగా తెరిస్తేనే కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, కేవలం ప్రైవేట్ శక్తుల ప్రయోజనాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టవద్దని తెలంగాణ రైతు ఐక్య వేదికలు డిమాండ్ చేస్తున్నాయి.

రియల్ ఎస్టేట్ లాబీయింగ్.. భూములపై కన్ను

బోధన్, మెదక్ (మంబోజిపల్లి) పరిధిలో ఈ చక్కెర ఫ్యాక్టరీలకు వేల ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. గత పదేళ్లలో వీటి మార్కెట్ విలు వ 200 రెట్లు పెరిగింది. ఫ్యాక్టరీలను నడిపి రైతులను ఆదుకోవడం కంటే, ఈ విలువైన భూములను రియల్ ఎస్టేట్ లేదా ఇతర కార్పొరేట్ సంస్థల వాణిజ్య అవసరాలకు కేటాయించేందుకే ప్రభుత్వం లోపాయికారీగా మొగ్గు చూపుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉచిత హామీల అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా అప్పులు చేస్తోంది. ఇలాంటి తరుణంలో నిజాం షుగర్స్ సంపూర్ణ పునరుద్ధరణకు కనీసం రూ. 700 కోట్లు అవసరమని అంచనా. అంత బడ్జెట్ కేటాయించే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లే బ్యాంకుల వన్ టైం సెటిల్మెంట్ బకాయిల పేరిట కాలం వెళ్లదీస్తూ, రాబోయే రోజుల్లో ’రైతులు చెరకు పండించడం లేదు..అందుకే ఫ్యాక్టరీ నడపలేకపోతున్నాం..

అనే నెపం రైతులపైకి నెట్టి చేతులెత్తేసే ప్లాన్ చేస్తోందని విమర్శిస్తున్నారు.  తెలంగాణలోని నిజాం, దక్కన్ షుగర్స్ పూర్తిగా తెరుచుకుంటే పొరుగు జిల్లాల్లో, పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు చెరకు రాక తగ్గిపోతుంది. ఆయా ఫ్యాక్టరీల యజమానుల ఒత్తిడి, రాజకీయ లాబీయింగ్ వల్లే కాంగ్రెస్ ఈ మిల్లుల పునఃప్రారంభాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని రైతులు భావిస్తున్నారు.

మెదక్ రైతాంగానికి తీరని అన్యాయం..

మెదక్ జిల్లా మంబోజిపలిలోని దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని వేలాది మంది రైతులకు జీవనాధారంగా ఉండేది. ఈ ఫ్యాక్టరీ లేఆఫ్ ప్రకటించి మూతపడటంతో, మెదక్ రైతులు పొరుగున ఉన్న ప్రైవేట్ కర్మాగారాలకు భారీ రవాణా ఖర్చులు భరించి చెరకు తరలించాల్సి వచ్చింది. ఖర్చులు పెరిగి, గిట్టుబాటు రాక మెదక్ జిల్లాలో చెరకుసాగు దాదాపు అంతరించిపోతోంది. ప్రభుత్వం బోధన్ గురించే మాట్లాడుతుండటంతో, మెదక్ దక్కన్ షుగర్స్ రైతులు తాము పూర్తిగా విస్మరించబడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.