టార్గెట్ కేటీఆర్!
- సీఎం రేవంత్ సిరిసిల్ల సభపైనే అందరి దృష్టి
- రేపే బహిరంగ సభ.. భారీ ఏర్పాట్లు
- అసెంబ్లీలో చెప్పినట్లే పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి
- అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
- అనంతరం సభలో ప్రసంగం
- హీటెక్కిన రాజకీయాలు
కరీంనగర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): సిరిసిల్లలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) పాల్గొనే సభ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల అసెంబ్లీ వేదికగానే(Assembly Platform) ఆయన సిరిసిల్లకు వస్తానంటూ ప్రకటించారు. వరుసగా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) టార్గెట్‌గా అధికార పార్టీ కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి పర్యటన అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పర్యటన, సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో సిరిసిల్లలో ఏం జరిగింది? ఎవరు బాగుపడ్డారు? జరగాల్సింది ఏమిటి? బాగుపడాల్సింది ఎవరు?.. అనేదానిపై సభా వేదిక నుంచి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నట్లు సమాచారం. తాజాగా కేటీఆర్ కూడా సీఎం రేవంత్‌కు లేఖ రాస్తూ.. పలు అంశాలను ప్రస్తావించారు. ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తుండటం.. అటు కేటీఆర్ కూడా లేఖ రాయడం వంటి పరిణామాలతో సిరిసిల్ల రాజకీయాలు హీటెక్కాయి.
కేటీఆర్ కోటను బద్దలు కొడ్తామంటూ..!
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 30న కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. సిరిసిల్ల సమీపంలోని రగుడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ కంచుకోటగా భావించే సిరిసిల్లలో అడుగుపెట్టి, అక్కడ కాంగ్రెస్ బలాన్ని నిరూపించడం ద్వారా బీఆర్‌ఎస్ అగ్ర నేతలకు గట్టి కౌంటర్ ఇవ్వాలనేది సీఎం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది. సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నలుగురు మంత్రులు సిరిసిల్లలో పర్యటించి.. కేటీఆర్ కోటను బద్దలు కొడుతామని చెప్పారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకులు వందల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించారని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో భూ ఆక్రమణల అంశాన్ని, దళిత సమస్యలను కాంగ్రెస్ ప్రధాన అస్త్రాలుగా ఎంచుకునే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి తొలుత కరీంనగర్‌లో జిల్లా కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రజల్లోకి ఆయన తీసుకెళ్లనున్నారు.
భారీగా ఏర్పాట్లు
సీఎం సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. సభ విజయవంతం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. దాదాపు 1,000 బస్సుల ద్వారా భారీగా జనసమీకరణ చేసేందుకు, నియోజకవర్గంలో 4 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సభతో కేటీఆర్ రాజకీయ పతనం ప్రారంభమవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కేకే మమహేందర్‌రెడ్డి తదితరులు అంటుండగా.. బీఆర్‌ఎస్ శ్రేణులు సైతం దీనిపై అంతే దీటుగా స్పందిస్తున్నాయి.