మద్యం విక్రయాలకు బ్రేక్..
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాల మూసివేత
హైదరాబాద్: గణేశ్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో తెలంగాణలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల(Liquor shops)ను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
హైదరాబాద్‌లో నిమజ్జన శోభాయాత్రలు జరిగే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలపై ఆంక్షలు అమలు చేయనున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం నిమజ్జన సమయంలో భారీగా తరలివచ్చే భక్తులు, ప్రజల భద్రతతో పాటు శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పలు జిల్లాల్లోనూ ఆంక్షలు
హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి తదితర ప్రాంతాల్లోనూ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో నిమజ్జన శోభాయాత్రలు సాగే మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో నిర్ణయించిన సమయం నుంచి 24 గంటల పాటు మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి. నిమజ్జన వేళ మద్యం సేవించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు.
ఉల్లంఘిస్తే చర్యలు
మద్యం విక్రయాలపై విధించిన ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘించి అక్రమంగా విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు పోలీసు, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.కొన్ని ప్రాంతాల్లో స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు నిబంధనల ప్రకారం మినహాయింపులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, స్థానికంగా జారీ చేసిన ఉత్తర్వులే తుది ప్రామాణికంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.