ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ కరెంటు కష్టాలు రానివ్వం
యూనిట్ కు రూ.12 పెట్టి కొనేందుకైనా సిద్ధంగా ఉన్నాం
ప్రత్యామ్నాయంగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి
గత పాలకుల మాదిరి మాది దొరల ప్రభుత్వం కాదు.. పేదోడి ప్రజా ప్రభుత్వం
మొదటి విడతలో 2.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేశాం
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో పాలేరు వాగుపై చెక్ డ్యామ్ ప్రారంభోత్సవం
31 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ ల పంపిణీ
నేలకొండపల్లి,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా, ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం(Impact of El Niño)తో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ప్రజలకు కరెంట్ కష్టాలు రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు.
నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో రూ. 6.65 కోట్లతో పాలేరు వాగు పై నిర్మించిన చెక్ డ్యామ్ ను, వట్టుకుంట వాగు వరకు రూ. 2.50 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ దివాకర.టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేలకొండపల్లి మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించిన ఈ చెక్ డ్యామ్ ద్వారా.. నేలకొండపల్లి మండలం తో పాటు, సమీప కోదాడ మండలానికి కూడా సాగునీరు అందుతుందని తెలిపారు.
సాగు, తాగునీటి కొరత రానీయకుండా చూశాం..
ఎల్ నినో ప్రభావం తాండవిస్తున్నా... తాగు, సాగునీటి కొరత పరిస్థితులు రానీయకుండా చూసామని అన్నారు. ఇటీవలి తుఫానుతో కొంత మేలు జరిగిందని తెలిపారు. విద్యుత్ కొరత రానీయకుండా.. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి యూనిట్ కు రూ.12 చొప్పున కొనేందుకైనా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అలాగే ప్రత్యామ్నాయంగా.. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులపై కూడా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ కొరత పరిష్కారంపై.. ఇటీవలి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.
గతంలో దొరల ప్రభుత్వం.. మాది పేదోడి ప్రజా ప్రభుత్వం
గత పాలకులు దొరల ప్రభుత్వాన్ని నడిపించారని, తమది పేదోడి పక్షాన నిలిచే ప్రజా ప్రభుత్వమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సన్న బియ్యం, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను పేదోడి గడప వరకు చేర్చామని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల చిరకాల కల అయిన సొంతింటిని ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సాధ్యం చేశామని తెలిపారు. మొదటి విడతలో 2.25 లక్షల ఇళ్లు పూర్తి చేశామని, రెండో విడత కూడా కేటాయించామని, ఒక హైదరాబాద్ లోనే లక్ష ఇళ్లు కేటాయించామని స్పష్టం చేశారు.
గత పాలకుల మాదిరిగా.. తమది దొరల ప్రభుత్వం కాదని, పేదోడి పక్షాన నిలిచే ప్రజా ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో..: కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొడాలి గోవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్, నాయకులు నెల్లూరి భద్రయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొందయ్య, బచ్చలికూర నాగరాజు, సర్పంచ్ సైదులు, పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.