టీజీఎఫ్‌సెట్-2026 షెడ్యూల్ విడుదల
- నిమిషం ఆలస్యమైనా అనుమతించం
- కన్వీనర్ కె. విజయ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఎఫ్‌సెట్ --2026 పరీక్షల నిర్వహణకు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 9 నుంచి మే 11 వరకు మూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయని కన్వీనర్ డాక్టర్ కె.విజయ్ కుమార్ రెడ్డి గురువారం ప్రకటించారు.
ఈ ఏడాది ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం మొత్తం 2,10,766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి.
పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థుల ను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా హాల్లోకి అనుమతించబోమని కన్వీనర్ స్పష్టం చేశారు. అభ్యర్థులను ఉద యం సెషన్‌కు 7.30 నుంచి, మధ్యాహ్నం సెషన్‌కు 1.30 నుంచి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తామ ని, పరీక్ష పూర్తయ్యే వరకు ఎవరినీ బయటకు పంపబోమన్నారు.
అభ్యర్థులు వెంట తెచ్చుకోవాల్సినవి..
అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పుడు తమ హాల్ టికెట్‌తోపాటు కనీసం ఓ ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు, నలుపు లేదా నీలం రంగు బాల్‌పాయింట్ పెన్ను వెంట తెచ్చుకోవాలి. పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావడం నిషేధమన్నారు. పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు సాధించిన మార్కు లు కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. తుది కీ ఆధారం గా మార్కులను నార్మలైజ్ చేసిన తర్వాతే ర్యాంకులను కేటాయిస్తామని వెల్లడించారు.






