calender_icon.png 13 February, 2026 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి పీఠం కైవసం ఎవరిది?

13-02-2026 12:59:07 AM

నేడు కౌంటింగ్.. ఉత్కంఠలో ఆసిఫాబాద్ రాజకీయ వర్గాలు

క్యాంప్ రాజకీయాలతో వేడెక్కిన వాతావరణం

ఆసిఫాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల ఫలితాలపై జిల్లా కేంద్రంలో ఉత్కంఠ నెలకొంది. బుధవారం జరిగిన పోలింగ్లో మొత్తం 20 వార్డులకు గాను 10,817 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల ఓట్లను జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. నేడు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా మధ్యాహ్నం నాటికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.

20 వార్డుల్లో పోలైన ఓట్లు....

మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో 899 ఓట్లకు 713, 2వ వార్డులో 504కు 445, 3వ వార్డులో 585కు 508, 4వ వార్డులో 664కు 424, 5వ వార్డులో 835కు 636, 6వ వార్డులో 961కు 687, 7వ వార్డులో 751కు 550, 8వ వార్డులో 689కు 588, 9వ వార్డులో 684కు 528, 10వ వార్డులో 501కు 385, 11వ వార్డులో 721కు 597, 12వ వార్డులో 506కు 397, 13వ వార్డులో 632కు 489, 14వ వార్డులో 658కు 530, 15వ వార్డులో 781కు 543, 16వ వార్డులో 836కు 657, 17వ వార్డులో 598కు 465, 18వ వార్డులో 669కు 508, 19వ వార్డులో 681కు 521, 20వ వార్డులో 772 ఓట్లకు గాను 646 ఓట్లు పోలయ్యాయి.

తొలి చైర్మన్ పీఠంపై పార్టీల కన్ను....

నూతన మున్సిపాలిటీ కావడంతో తొలి చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉత్సాహం అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ సర్వేలు భిన్న ఫలితాలు సూచిస్తున్న నేపథ్యంలో పోటీ హోరాహోరీగా సాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఓటరు తీర్పు ఎటువైపు ఉందన్నది మాత్రం బ్యాలెట్ బాక్స్లు తెరవకముందు చెప్పలేమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి పార్టీ తమ సర్వేల ఆధారంగా మెజార్టీ సాధిస్తామనే నమ్మకంతో ఉంది.

క్యాంప్ రాజకీయాలు..

మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేసిన బి.ఆర్.ఎస్కు చెందిన 15 మంది అభ్యర్థులను స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి బుధవారం రాత్రి క్యాంపుకు తరలించినట్లు సమాచారం. ఈ నెల 16న జరగనున్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం ఇలాంటి చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో బి.ఆర్.ఎస్ గెలుపుపై ధీమాగా ఉందనే ప్రచారం సాగుతోంది.

నేడే తేలనున్న అభ్యర్థుల భవితవ్యం...

గత నెల 28న నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో నిమగ్నమైన అభ్యర్థుల రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. నూతన మున్సిపాలిటీలో ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందో తెలుసుకోవడానికి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి పీఠాన్ని దక్కించుకునేది ఎవరో మరికొద్ది గంటల్లో తేలనుంది.