బొగ్గు గనిలో భారీ పేలుడు: 34 మంది దుర్మరణం
కరాచీ: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక బొగ్గు గనిలో మీథేన్ వాయువు పేలుడు( Pakistan coal mine blast) సంభవించడంతో కనీసం 34 మంది గని కార్మికులు మరణించారని, పలువురు కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు శుక్రవారం తెలిపారు. క్వెట్టా సమీపంలోని సోరేంజ్ బొగ్గు క్షేత్రంలో గురువారం షిఫ్ట్ మార్చుకుంటున్న సమయంలో ఒక బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ పేలుడు(Methane gas explosion) సంభవించి, పక్కనే ఉన్న గని కూడా దెబ్బతినడంతో పాటు 50 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయిన ఘటన చోటుచేసుకుంది. భూమికి సుమారు 4,000 అడుగుల లోతులో, గని కార్మికులు పేలుడు, తదనంతర అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ పేలుడు నిర్మాణాలు కూలిపోవడానికి దారితీసింది. దీంతో పలువురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు మండుతున్న శిథిలాల కింద చిక్కుకుపోయారు. బొగ్గు గని వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.






