గ్లోబల్ సమ్మిట్ ప్రతిష్టాత్మకం

24-09-2026 | 05:25am
  1. రాష్ట్ర ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చే చారిత్రాత్మక ఘట్టం 
  2. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ప్రపంచ పెట్టుబడుల సదస్సు
  3. అధికారులంతా స్ఫూర్తితో ఏర్పాట్లలో భాగం కావాలి
  4. దేశ, విదేశాల్లో రోడ్‌షోలు.. వార్‌రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ డిప్యూటీ భట్టి

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను(Investments) ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఏడాది డిసెంబర్ 7 నుం చి 9 వరకు నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Invest Telangana Global Summit) ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. ‘తెలంగాణ భవిష్యత్తును, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని కొత్త శిఖ రాలకు చేర్చే ఈ చారిత్రాత్మక ఘట్టంలో అధికారులంతా భాగస్వాములై గ్లోబల్ సమ్మిట్‌ను దిగ్విజయం చేయాలి’ అని  పిలుపునిచ్చారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సదస్సు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సదస్సు సన్నాహక సమావే శాన్ని బుధవారం సచివాలయంలో నిర్వహించా రు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భం గా ఏర్పాట్లు, ప్రచారం, రోడ్‌షోల నిర్వహణపై డిప్యూటీ సీఎం పక్కా కార్యాచరణను ఖరారు చేశారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో ప్రపంచ సదస్సు ఇదని, దీని ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

సదస్సు నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులతో 10 కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతి కమిటీకి ఒక సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. పనుల రూపకల్పన, బడ్జెట్ అంచనాలు, ఆమోదాల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అధికారుల కమి టీలతోపాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసి, వాటికి సంబంధిత మంత్రులను చైర్‌పర్సన్లు గా నియమించినట్లు తెలిపారు. ప్రతి కమిటీకి కన్వీనర్లను కూడా నియమించామని, వారు వెంటనే సంబంధిత మంత్రులను కలిసి పనులు ప్రారంభించాలని సూచించారు.

అన్ని విభాగాలను సమ న్వయం చేసుకుంటూ ప్రతిరోజూ కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా వేదికలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ‘ఈ రోజు నుంచే ప్రతిరోజూ సదస్సుకు సంబంధించిన ఏదో ఒక వార్త మారుమోగాలి. ప్రచారానికి ఆకాశమే హద్దుగా పనిచేసి, పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలి‘ అని అధికారులకు స్పష్టం చేశారు.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే ధ్యేయం

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న బృహత్తర లక్ష్యంలో ఈ సమ్మిట్ కీలక మైలురాయి కానుందని పేర్కొన్నారు. గతంలో కుదిరిన ఎంవో యూలను కూడా సమీక్షించి, వాటి అమలు పురోగతిని పరిశీలించాలని అధికారులను ఆదేశిం చారు. రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ప్రతి అధికారి భాగస్వామి కావాలని సూచించారు. సదస్సు ఏర్పాట్లను కేవలం ఒక కార్యక్ర మంగా కాకుండా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడే ఆస్తిగా తీర్చిదిద్దాలన్నారు.

తెలంగాణ కు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాలు, నగరాలు, రంగాలను గుర్తించి దాని కి అనుగుణంగా రోడ్‌షోల ప్రణాళిక రూపొందించి మంత్రిమండలి ఉపసంఘానికి నివేదించా లని ఆదేశించారు. అధికారులు వెంటనే తమ టీమ్‌లతో సమావేశమై వార్‌రూమ్ ద్వారా పనులను పర్యవేక్షించాలని, ప్రతిరోజూ సాయంత్రం పనుల పురోగతిని తనిఖీ చేసిన తర్వాతే రోజువారీ బాధ్యతలు ముగించాలని చెప్పారు.

ప్రతినిధుల స్పందనను బట్టి అవసరమైతే ప్రస్తుతం అనుకుంటున్న 4 సభా ప్రాంగణాలను (హాల్స్) 6 లేదా 8కి పెంచేందుకు సిద్ధంగా ఉండాలని సూచించా రు. రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక వికాసంలో అధికారులందరూ భాగస్వాములు కావాలని, ఎక్కడా రాజీ పడకుండా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

తెలంగాణ విశిష్టత ప్రతిబింబించాలి: మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్రంలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ కేవలం పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా, తెలంగాణ సంప్రదాయాలు, సాంస్కృతిక విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉం డాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫైవ్‌స్టార్ హోటళ్ల వాతావరణం దేశవ్యాప్తంగా ఎక్కడైనా సాధారణంగానే ఉంటుందని, అయితే మన రాష్ట్ర ప్రత్యేకతను విదేశీ, జాతీ య ప్రతినిధులకు పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు.

బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం, మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడి ప్రత్యేక వంటకాలు ఈవెంట్‌లో ప్రధానంగా ఆకట్టుకునేలా ఉండాలని సంబంధిత అధికారి హరిచందనకు సూచించారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి దాదాపు 2వేల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి మన సంస్కృతి ఒక దృశ్యకావ్యంగా నిలిచిపోవాలని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో జరిగిన జీ20, బ్రిక్స్ సమ్మిట్‌ల తరహాలోనే సాయంత్రం వేళ్లలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు మన వారసత్వాన్ని చాటిచెప్పేలా ప్లాన్ చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమైనప్పటికీ, అంతర్జాతీయ వేదికపై నూతన తెలం గాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి చాటిచెప్పడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత అని ఉద్ఘాటించారు. 

మరిన్ని వార్తలు