మళ్లీ స్వర్ణం మనదే

23-09-2026 | 05:05am
  1. అదరగొట్టిన మహిళల క్రికెట్ జట్టు
  2. శ్రీలంకపై ఘన విజయం 
  3. చెలరేగిన షెఫాలీ, స్మృతి, రిచా ఘోష్
  4. లంకను తిప్పేసిన స్పిన్నర్లు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది. ఊహించినట్టుగానే భారత మహిళల క్రికెట్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి పసిడి పతకాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో షెఫాలీ వర్మ, స్మృతి మం ధాన, రిచా ఘోష్ చెలరేగితే బౌలింగ్‌లో స్పిన్నర్లు తిప్పేశారు.

నిస్సన్, సెప్టెంబర్ 22: ఆసియా క్రీడ(Asian Games)ల్లో పసిడి పతకమే లక్ష్యంగా బరి లోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు(Indian women's cricket team) అదరగొట్టింది. పూర్తి అధిపత్యం కనబరుస్తూ ఫైనల్లో లంకను నిలువరించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన(Smriti Mandhana) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. మంధాన తన 37వ టీ ట్వంటీ హాఫ్ సెంచరీ సాధించగా, షెఫాలీ 2 పరుగుల తేడాతో అర్ధ సెంచరీ చేజార్చుకుంది.

లంక బౌలర్లపై వీరిద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. స్మృతి కేవలం 45 బంతుల్లో 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, షెఫాలీ వర్మ 48 పరుగులు చేశారు. ఆఖరి ఓవర్లలో రిచా ఘోష్  22 బంతుల్లో 49 నాటౌట్ (6 ఫోర్లు, 3 సిక్సర్లు) రన్స్‌తో విరుచుకుపడింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో భారత్ 25 పరుగులు రాబట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 13 సిక్సర్లు బాదిన భారత్ 20 ఓవర్లలో 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలోనే మహిళల క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు.

217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టును(Sri Lanka team) భారత బౌలర్లు బెంబేలెత్తించారు. లంక కెప్టెన్ చమరి ఆటపట్టు (29) మినహా ఆ జట్టులో ఏ ఒక్క బ్యాటర్ కూడా భారత బౌలింగ్‌ను ఎదుర్కొని నిలవలేకపోయారు. కేవలం 15.4 ఓవర్లలోనే శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, షెఫాలీ వర్మ తలో రెండు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించారు.

ఈ విజయంతో ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్ తన స్వర్ణ పతకాల ఖాతాను(Gold medal tally) తెరిచింది. గత 2022 ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం గెలిచిన భారత మహిళల జట్టు, ఇప్పుడు వరుసగా రెండోసారి కూడా పసిడి పతకాన్ని నిలబెట్టుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ చారిత్రక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఐసీసీ ఛైర్మన్ జై షా ఎక్స్ వేదికగా జట్టుకు అభినందనలు తెలిపారు. భారత క్రికెట్‌కు ఇది చారిత్రక క్షణమని, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, సమష్టి కృషితో టీమిండియా అదరగొట్టిందని ప్రధాని కొనియాడారు. ఈ క్రీడల్లో దేశానికి ఇది తొలి బంగారు పతకం అని, దేశం గర్వపడేలా చేసి యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.

స్కోరు బోర్డు..

భారత్ మహిళల ఇన్నింగ్స్: 216/3 (షెఫాలీ వర్మ 48, స్మృతి మంధాన 79, రిచా ఘోష్ 49; సుగంధిక 1/37, దిల్హార 1/35)

శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: 69 (చమరి ఆటపట్టు 29, కుషాని 14, దిల్హార 11; దీప్తి శర్మ 3/6, షెఫాలీ 2/3, శ్రీ చరణి 2/13)

మరిన్ని వార్తలు