జర్నలిస్ట్ శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
- పాలమూరు జిల్లా నుంచే సీఎం ఉన్నా మేలు జరగలే..
- తక్షణమే హెల్త్ కార్డులు మంజూరు చేయాలి
- మరణించిన జర్నలిస్టులకు రూ.10లక్షలు ఆర్థికసాయం
- లేదంటే పాలమూరు ముంచే మరో ఉద్యమానికి శ్రీకారం
- టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి జి మధు గౌడ్
- సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ పార్దీవదేహానికి నివాళి
జడ్చర్ల,సెప్టెంబర్ 22: మహబూబ్నగర్ సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్(Srinivas, senior journalist from Mahabubnagar) గుండె పోటుతో మరణించడం అత్యంత బాధాకరమని, ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేసి ఉంటే శ్రీనివాస్ ప్రాణం కోల్పోయేవాడు కాదని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని టియుడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా సీనియర్ జర్నలిస్టు, స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ గుండె పోటుతో సోమవారం మృతిచెందగా వారి స్వస్థలం జడ్చర్ల మండలం నసరుల్లాబాద్ గ్రామంలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.
టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాటం నాగరాజుగౌడ్, సతీష్ రెడ్డితో పాటు జిల్లా నాయకులు, తోటి జర్నలిస్టులు నసరుల్లాబాద్ చేరుకొని శ్రీనివాస్ పార్దివదేహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధు గౌడ్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలోనూ జర్నలిస్టులకు హెల్త్ కార్డుల మంజూరు చేసిన ఎక్కడా ఉపయోగపడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు ఏళ్లు దాటిన ఇప్పటివరకు హెల్త్ కార్డుల ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
30 ఏళ్ల జర్నలిజంలో రూ.40 వేలు సమయానికి లేక శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇప్పటికే ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేసి ఉంటే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయేవాడు కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు నుంచి ఉండటం జర్నలిస్టులు తమకు ఎంతో మేలు జరుగుతుందని సంబుర పడ్డారని, కానీ ఇప్పటికీ జర్నలిస్టులకు తీవ అన్యాయమే జరుగుతుందన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం అందజేస్తున్న సాయాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధిత జర్నలిస్టు కుటుంబానికి అందించే పెన్షన్ రూ.10 వేల కు పెంచాలని, జీవితకాలం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి హెల్త్ కార్డులు మంజూరు చేయని యెడల అతి త్వరలోనే మహబూబ్ నగర్ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎడిటర్లు విజయరాజు, భాస్కర్ రావు, చంద్రశేఖర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు దతేందర్, మల్లేష్ సాగర్, ఐజేయు వనపర్తి జిల్లా కార్యదర్శి రాజు, కే రవి, గోపాల్, రఫీ, బాలరాజు, రాఘవేందర్, రవి, శ్రీనివాస్ గౌడ్, మహేష్ కుమార్, పాల్గొన్నారు.