వసతి గృహాన్ని త్వరగా ఏర్పాటు చేయాలి
నిర్మల్ సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి) : నిర్మల్ పట్టణంలోని(Nirmal Town) కస్బా ఉన్నత పాఠశాల(Kasba High School) భవంతిని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంగా(BC Boys Welfare Hostel) వినియోగించేందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కస్బా ఉన్నత పాఠశాల భవంతిని పరిశీలించారు. ఖాళీగా ఉన్న భవంతిని బీసీ విద్యార్థుల వసతి గృహంగా మార్చి, వీలైనంత త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
భవంతిలో అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టి, విద్యార్థులకు అనుకూలమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వసతి గృహం అందుబాటులోకి వస్తే బీసీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
కలెక్టర్ వెంట డీఈవో భోజన్న, బీసీ, మైనార్టీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, తహసిల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.