ప్రజాకవి కాళోజీ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, సెప్టెంబర్ 9: ప్రజా కవి కాళోజీ నారాయణరావు(Poet Kaloji Narayana Rao) జీవితం, ఆయన సాహిత్య స్ఫూర్తి, ప్రజా సమస్యలపై ఆయన చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ పాండు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(District Collector Prateek Jain) మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు తన రచనల ద్వారా ప్రజల సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు సమాజం ముందుకు తీసుకువచ్చి ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని నింపారని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, సామాన్యుల గొంతుకగా తన సాహిత్యాన్ని మలిచిన కాళోజీ ప్రజా కవిగా చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు కేవలం కవిగా మాత్రమే కాకుండా సామాజిక చైతన్యవేత్తగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్య స్ఫూర్తి, ఆయన రచనలు ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని నింపాయని అన్నారు. ఆయన సాహిత్యం నేటికీ ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తోందని, కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, డీపీఆర్వో విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.