వీర నారి చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి

26-09-2026 | 11:54pm

మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి 

లక్షేట్టిపేట, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): భూస్వాముల, పెత్తందారుల ఆధిపత్యాన్ని ఎదురొడ్డి, భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన రైతాంగ పోరాటంలో(Peasant Struggle) చాకలి ఐలమ్మ(Chakali Ilamma) సేవలు మరువలేనివని మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షేట్టిపేటలో చాకలి ఐలమ్మ 131 వ జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహనికి పూల మాల వేసి వందనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఐలమ్మ తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా పోరాటం చేసింద‌న్నారు.

ఐలమ్మ పోరాట, త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. అణిచివేతకు గురైన వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి ఐలమ్మ పోరాట మార్గం ఆదర్శనీయమని వివరించారు. అంతకుముందు రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఐలమ్మ త్యాగాలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకట్ స్వామి, పీఏసీఎస్ చైర్ పర్సన్ నాగభూషణం,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షాహిద్ అలీ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆరీఫ్, కౌన్సిలర్లు సుజాత, పద్మ, చంద్ర మౌళి,నాయకులు మడిపెల్లి స్వామి, సురేష్, తిరుపతి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు