వరస మారుతున్నది
జాతీయ గేయం వందేమాతరం(National Song Vande Mataram) ఆరు చరణాలు పాడాలంటున్నది కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ(BJP). 1937లో చేసిన తీర్మానం ప్రకారం రెండు చరణాలే పాడుతామంటున్నది ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్(opposition party, Congress). దేశంలో కొన్నిరోజులుగా ఇదే అంశం చుట్టూ రాజకీయ పార్టీల(political parties) మధ్య వాదోపవాదాలు సాగుతున్నాయి. నాయకుల మధ్య వందేమాతరం వరస మారుతున్నది. ఆగస్టు 15న కాంగ్రెస్ అగ్ర నేతలు(Top Congress leaders) వందేమాతరాన్ని అవమానించారని బీజేపీ ఉద్యమాన్ని మొదలుపెట్టింది.
ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆరుచరణాల నినాదాన్ని బీజేపీ ఎత్తుకున్నదని కాంగ్రెస్ అంటున్నది. కాంగ్రెస్ పాలిత ప్రాంతం కర్నాటక(Karnataka)లో రెండు చరణాలు మాత్రమే పడుతామని ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) ప్రకటించారు. అసలు ఎన్ని చరణాలు పాడాలన్నదానిపై సంగీతకారుడు టి.ఎం.కృష్ణ సుప్రీంకోర్టు(Supreme Court)కు ఎక్కడం, దేశ అత్యున్నత న్యాయస్థానం తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎన్ని చరణాలు పాడాలన్నది దేశపౌరుల వ్యక్తిగత నిర్ణయమని, పూర్తి చరణాలు పాడని వారిపై చర్యలు తీసుకోలేరని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యా నించడం గమనార్హం. 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్‌లోని 3వ సెక్షనకు ఈ ఏడాది జూలైలో పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం వందేమాతరానికి వర్తింపజేసింది. దీని ప్రకారం, వందేమాతరం పాడటాన్ని అడ్డుకున్నా, ఆలపిస్తున్న సభకు అంతరాయం కలిగించినా నేరమే. గరిష్టంగా మూడేండ్ల వరకు జైలు శిక్ష. అధికారిక కార్యక్రమాల్లో ఆరు చరణాలు పాడాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలూ ఇచ్చింది.
ఆనాడు బ్రిటీషర్లపై పోరాటానికి, స్వాతంత్య్రోద్యమానికి ప్రేరణగా 1875లో ఆరు చరణాల ‘వందేమాతరం’ గేయాన్ని బంకించంద్ర ఛటర్జీ లిఖించారు. అయితే.. ఏడెనిమిది దశాబ్దాలుగా రెండు చరణాల ఆలాపన కొనసాగుతున్నది. నాటి కాంగ్రెస్ పాలకులు కావాలనే కుదించారని, మొత్తం ఆరు చరణాలు పాడాలని కమలనాథులు అంటున్నారు. కొన్నివర్గాల మనోభావాలను దెబ్బతీయాలన్నదే బీజేపీ ఉద్దేశమని కాంగ్రెస్ వాదిస్తున్నది. తాజాగా కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వివరణ ఏమిటన్నది రెండువారాల్లో తేలనుంది.