థియేటర్లు ఊగిపోతాయ్
న్యాచురల్ స్టార్ నాని(Natural Star Nani) పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్(Pan-India period action entertainer) ‘ది ప్యారడైజ్(The Paradise)’. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో, ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
జడల్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ఏమనిపించింది?
కథలో నుంచి వచ్చిన లుక్ అది. చాలా కొత్తగా అనిపించింది. ఇందులో క్యారెక్టర్ సొసైటీలో పెరిగిన వ్యక్తి కాదు. ఆ క్యారెక్టర్‌కు బిగినింగ్ నుంచే ఒక మ్యాడ్నెస్ ఉంటుంది. నిజానికి తెలుగులోనే ఇలాంటి క్యారెక్టర్ చాలా కొత్త. నా మీద ఆ క్యారెక్టర్ ఫ్రెష్‌గా ఉంటుంది. జడలతో లుక్ చూసి సర్‌ప్రైజ్ అయ్యారు. ఇందులో ప్రతి డీటెయిల్‌కు ఒక కారణం ఉంటుంది. ఇందులో మీరు చూస్తుంది సవారీల బొట్టు. ఎవరినైనా బలవంతంగా తీసుకెళ్లి టాటూ వేస్తే వాడు సవారీ అయిపోయినట్టే. అలాగే ముక్కుపుడక, చైను అన్నిటికీ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది.
మీ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదా.. ఈ సినిమా ఎలా ఉంటుంది?
-ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే సినిమా ఇది. మదర్ -సన్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుంది. మాస్, యాక్షన్ థియేటర్ అదిరిపోయేలా ఉంటుంది. నా కెరీర్‌లోనే ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన సినిమా ప్యారడైజ్.
మోహన్‌బాబు గారి క్యారెక్టర్?
శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే మోహన్‌బాబు గారు అయితే బాగుంటుంది అని అన్నాడు. శ్రీకాంత్ కథ చెప్పడానికి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్లాడు. ఆయన చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. ఈ కథ విన్నప్పుడే ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్మిన మొదటి వ్యక్తి మోహన్ బాబు గారు.
పాన్ ఇండియా ప్రమోషన్స్ గురించి?
ఈ సినిమా కంటెంట్ అన్ని ప్రాంతాల్లో రీచ్ అయ్యి ఉంది. అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ప్రేక్షకులు ఎంతో ప్రేమను ఇస్తున్నారు.
ఎక్కువగా డ్యాన్స్ చేశారు కదా?
శ్రీకాంత్ దృష్టిలో నేను పెద్ద డ్యాన్సర్ని (నవ్వుతూ). నువ్వు డ్యాన్స్ చేస్తే మస్తు ఉంటది అన్న అని చెప్తుంటాడు. నేను డ్యాన్స్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తాడు. శ్రీకాంత్ కోసం చేయాలనుకున్నాను. తన నమ్మకం నిజమైంది. పాటలు రిలీజ్ అయిన తర్వాత అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. ఇందులో మరో పాట ‘అంజనా అంజనీ’ త్వరలోనే రిలీజ్.
మదర్ సెంటిమెంట్ గురించి?
మా గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు ఒక తల్లి తన కొడుకు గురించి చెప్పే కథగా మొదలు పెట్టాము. టీజర్లో కూడా మెయిన్ ఎలిమెంట్ మదర్ మీదే కట్ చేశాము. సినిమా మొదలయ్యేదే మదర్ ఎమోషన్‌తో. మదర్‌తో ఎండ్ అవుతుంది. అది మీకు హ్యాంగోవర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూడు, నాలుగు రోజులు ‘ప్యారడైజ్’ మీ మైండ్ నుంచి వెళ్లదు.
‘ప్యారడైజ్’ అనే ప్లేస్ గురించి?
‘ప్యారడైజ్’ అనే ప్లేస్లో సవారి అనే ఒక ట్రైబ్‌కు సంబంధించిన కథ ఇది. అక్కడ సవారీలకు గుర్తింపు లేదు. వాళ్ల ఉనికిని కూడా ఎవరు పట్టించుకోరు. వాళ్లని చంపేసినా సరే కేసు కూడా పెట్టరు. ఐడెంటిటీ కోసం చేసిన ఒక తిరుగుబాటు. 1984 టైమ్లైన్ మధ్య ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్యారడైజ్ ప్రపంచంలోకి వెళ్లిపోతారు.
రిస్కీ షాటు.. గాయాల గురించి?
నాకు ఇష్టం, ఓపిక ఉన్నాయి. అన్ని నేనే స్వయంగా చేశాను. ఇంకో 15 ఇయర్స్ తర్వాత డూప్‌కు అప్పచెప్తానేమో (నవ్వుతూ). డూప్ చేస్తే నేను ఎంజాయ్ చేయలేను. అది నా ప్రాబ్లం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను సినిమాలో లెగ్ షాట్ అయినా, హ్యాండ్ కనిపించే షాట్ అయినా నేనే స్వయంగా చేస్తా. స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ‘అబ్బా.. ఇది డూప్ షాట్’ అని అనిపిస్తే ఆ కాంప్లిమెంట్ను నేను జెన్యూన్గా తీసుకోలేను.
హీరోయిన్, నిర్మాత గురించి?
హీరోయిన్ క్యారెక్టర్ చాలా సాలిడ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ స్టోరీ ఆర్క్ చాలా ఇంపార్టెంట్. ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో, బిజినెస్ విషయంలో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకున్న సమయంలో రిలీజ్ చేయడానికి అందరం ఒత్తిడి తీసుకున్నాం. అందరూ 24 గంటల పాటు పనిచేశారు. ఇప్పటికే సినిమా ఒకటి రెండు సార్లు వాయిదా పడాల్సి వచ్చింది. ఈసారి అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని, క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఇవ్వాలని మేము అహర్నిశలు పని చేశాం.