గిరిజన యువతకు పోలీస్ ఉద్యోగాల్లో 75 శాతం అవకాశం కల్పించాలి

22-09-2026 | 09:37pm
  1. జీవో నం.109 ప్రకారం పోలీస్ నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన గిరిజన ఎమ్మెల్యేల బృందం
  2. సమస్య పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం..

ఉట్నూర్, సెప్టెంబర్ 22 ( విజయక్రాంతి): రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ నియామకాల్లో జీవో నం.109 ప్రకారం 75 శాతం స్థానిక గిరిజన యువతకు అవకాశం కల్పించాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క  ల ఆధ్వర్యంలో గిరిజన ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని(Chief Minister Revanth Reddy) కలిసి కోరింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన యువతకు పోలీస్ ఉద్యోగాల్లో న్యాయం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాల్లో స్థానికతకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నం.109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ నియామకాల్లో 75 శాతం స్థానికులకు అవకాశం కల్పించేలా తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నిర్ణయం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల గిరిజన నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయని వివరించారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిశీలించి పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని సీఎం  హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ట్రైబల్ ఎమ్మెల్యేలు ఆది నారాయణ్, కోరెం కనకయ్య, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు