వినాయకుని నిమజ్జనానికి నీటి గండం

22-09-2026 | 11:21pm

నిమజ్జనానికి చుక్క నీరు లేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి

చెరువులు, కుంటల్లో నీరు లేక భక్తుల్లో ఆందోళన

హుజురాబాద్, సెప్టెంబర్ 22: (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితుల కారణంగా హుజురాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనా(Vinayaka immersion)నికి నీటి గండం ఏర్పడింది. ప్రతి ఏటా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కాకతీయ కెనాల్‌లో ఈసారి సరిపడా నీరు లేకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఎండీలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో కాకతీయ కెనాల్‌కు నీటి విడుదల లేకపోవడం సమస్యగా మారింది.

పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో తొమ్మిది రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణేశ్ విగ్రహాలను బుధవారం నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే నిమజ్జన ప్రదేశాల్లో సరిపడా నీరు లేకపోవడంతో ఏర్పాట్లపై సందిగ్ధత నెలకొంది. ప్రధాన చెరువులు, కుంటల్లో కూడా నీటిమట్టం తక్కువగా ఉండటంతో నిమజ్జనానికి నీటి కొరత మరింత తీవ్రంగా కనిపిస్తోంది.

ప్రతి ఏటా నిమజ్జనోత్సవాలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తుండగా, ఈసారి వర్షాలు తక్కువగా కురవడంతో నీటి సమస్య తలెత్తింది. నిమజ్జనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి, అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు