కేసీఆర్ కుటుంబ అక్రమాలు బయటపెడ్తం
- చెరువులు, అసైన్డ్ భూములు దోచుకున్నారు
- ఫామ్‌హౌస్‌లను డ్రగ్స్, రేవ్ పార్టీలకు అడ్డాగా మార్చారు
- కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఆగ్రహం
- అజీజ్‌నగర్, మొయినాబాద్‌లో ఫామ్‌హౌస్‌ల పరిశీలన
రంగారెడ్డి/ మొయినాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): బీఆర్ఎస్ పాలన(BRS Rule)లో కేసీఆర్ కుటుంబం(KCR family) అక్రమంగా వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకుందని.. వాటి చిట్టాను ప్రజల ముందు ఉంచుతామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు(Congress public representatives) అన్నారు. ఫామ్‌హౌస్(Farmhouse)లో సామ్రాజ్యాలు నిర్మించుకున్నారని.. వాటిని డ్రగ్స్, రేవ్ పార్టీల(Drugs, rave parties)కు అడ్డాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. అక్రమంగా దోచుకున్న భూములను స్వాధీనం చేసుకొని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంచు తామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలోని అజీజ్‌నగర్, మొయినాబాద్(Moinabad), చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు ఫామ్‌హౌస్ లు, వివాదాస్పద భూములను ఆదివారం కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్, అనిల్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్, ఎమ్మెల్యే లు వీర్లపల్లి శంకర్, నవీన్ యాదవ్ పరిశీలించారు.
అఫిడవిట్లలో లేవు: చామల
తెలంగాణ ఉద్యమ సమయంలో సాధారణ జీవితం గడిపిన బీఆర్ఎస్ నేత లు ఇప్పుడు వందల ఎకరాలకు యజమానులుగా ఎలా మారారో ప్రజలకు వివరించేందుకే ఈ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజాం రాజులు తమ 200 ఏళ్ల పాలనలో సంపాదించిన దానికంటే ఎక్కువగా కేసీఆర్ కుటుంబం పదేండ్ల అధికారంలోనే సంపాదించిందని దుయ్యబట్టారు. ఒకవైపు రాష్ట్రం రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోతే, కేసీఆర్ కుటుంబానికి మాత్రం వందల, వేల ఎకరాల ఆస్తులు ఎలా వచ్చాయి? అని ఆయన నిలదీశారు.
“సిద్దిపేటలోని హరీశ్‌రావు ఫామ్‌హౌస్, జన్వాడలోని కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో పాటు తాజాగా అజీజ్ నగర్ భూములను పరిశీలించాం. 2004 ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్‌కు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ లేదు. 2009లో కేటీఆర్ తొలిసారి పోటీ చేసినప్పుడు జన్వాడ ఫామ్‌హౌస్ ప్రస్తావనే లేదు. ఉద్యమ సమయంలో రబ్బరు చెప్పులతో తిరిగిన హరీశ్‌రావుకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
ఇరిగేషన్ మంత్రిగా ప్రాజెక్టు కట్టి, దానికి సమీపంలోనే సొంతంగా ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్లతోనే ఈ భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. అజీజ్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 76లోని భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, అక్కడ నిబంధనలకు విరుద్ధంగా జీవో 111ను ఉల్లంఘించి భారీ ఫామ్‌హౌస్, అక్రమ నిర్మాణాలు ఎలా చేపట్టారని ఆయన ప్రశ్నించారు. హరీశ్‌రావు ఫామ్‌హౌస్ భూములను స్వాధీనం చేసుకుని దళితులు, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ నుంచే గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు నాటకం నడిచిందని, మునుగోడు ఉప ఎన్నికల ముందు నలుగురు ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచే తీసుకెళ్లారని ఎంపీ చామల ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఫామ్‌హౌస్‌లను డ్రగ్స్, రేవ్ పార్టీల స్థావరాలుగా మార్చేశారని ఆయన విమర్శించారు.
ఆ భూములు అమరుల కుటుంబాలకు: అద్దంకి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాయకులు ఆక్రమించిన అక్రమ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు పంచాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. “గత పదేండ్ల్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వేల ఎకరాల భూములను దోచుకుని దాచుకున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమాత్రం కక్ష సాధింపు చర్యలు కావు.
బీఆర్ఎస్ నేతలు పదేండ్లలో దోచుకున్న సొమ్మును, అక్రమాలను ప్రజల ముందర బటబయలు చేసేందుకే గత మూడు రోజులుగా ఫామ్ హౌస్ పరిధిలోని భూముల పర్యటనను చేపట్టాం” అని ఆయన స్పష్టం చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, వారి అనుచరులు అధికార దుర్వినియోగానికి పాల్పడి వేలాది ఎకరాల ప్రభుత్వ, చెరువులు, అసైన్డ్ భూములను దోచుకున్నారని ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. వీటన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.