అంబేద్కర్ విగ్రహం తొలగింపును అడ్డుకుంటాం
షాద్ నగర్, జులై 5(విజయక్రాంతి): రోడ్డు విస్తరణ పేరుతో షాద్నగర్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని కుట్రపూరితంగా తొలగించాలని చూస్తే సహించేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం షాద్నగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము రోడ్డు విస్తరణకు వ్యతిరేకం కాదని, చౌరస్తాను వెడల్పు చేసి అదే సర్కిల్ మధ్యలోనే అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
గతంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని వర్గాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి చౌరస్తా మధ్యలోనే విగ్రహాన్ని ఉంచాలని నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.విగ్రహాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నాలు చేస్తే బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన, ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.సమావేశంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జులు గుండేటి నర్సింలు, జి. బాలయ్య, తుప్పరి కుమార్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నీరటి రాజు, మండల అధ్యక్షులు శివగల్ల ఆంజనేయులు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.






