ఎవరినీ వదలం
స్పీకర్‌కు జరిగిన అవమానం.. తెలంగాణ సమాజానికి జరిగినట్లే.. దళితులు తిరిగిన నేలను శుద్ధి చేస్తారా?
దళితులను కించపరిచిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడుతాం
- శుద్ధి చేయాల్సింది మీ దొర అహంకారాన్ని..
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు
- ఫామ్‌హౌస్ కుట్రలపై సమగ్ర విచారణ..
- విచారణ అధికారిగా హైదరాబాద్ జాయింట్ సీపీ విజయ్‌కుమార్
- అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): దళితుడైన స్పీకర్‌తో పాటు, ఆ వర్గాలను అవమానించిన ఏ ఒక్కరినీ వదలిపెట్టబోమని, చట్టపరంగా కఠినంగా శిక్షి స్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. సెప్టెంబర్ 6న ఫామ్‌హౌస్(Farmhouse)లో జరిగిన కుట్రలు మొదలు, ఆ తర్వాత చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అంటరానితనం ప్రదర్శించిన వారితో పాటు కుట్ర లు పన్నిన, వాటిని అమలు చేసిన ప్రతి ఒక్కరినీ కోర్టు ముందు దోషులుగా నిలబెడుతామని పేర్కొన్నారు.
ఈ ఘటనలపై విచారణ అధికారిగా హైదరాబాద్ జాయింట్ సీసీ విజయ్‌కుమార్(Hyderabad Joint CP Vijay Kumar)ను నియమిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మహిళా ఎమ్మెల్యేల(women MLAs)పై జరిగిన దాడులతో పాటు విధుల్లో ఉన్న సిబ్బందిపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తామని చెప్పారు. బుధవారం ఆయ న అసెంబ్లీ(Assembly)లో మాట్లాడుతూ.. దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Speaker Gaddam Prasad Kumar)ను ఘోరమైన పదజాలంతో దూషించారని మండిపడ్డారు. రాజకీయంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చని.. కానీ, తల్లిని అవమానిస్తారా? అని ప్రశ్నించారు.
కుల వివక్ష, అణచివేతను తమ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. రాజకీయాలకు అతీతంగా కఠిన నిర్ణయా లు ఉంటాయని, ఈ విషయంలో ఎవరినీ వదలబోమని హెచ్చరించారు. ‘దళితులు తిరిగిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయించి తీవ్రంగా అవమానించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాతి యుగంలో ఉన్నామా? సమాజంలో ఆశాంతిని ప్రోత్సహించి రెండు జాతుల మధ్య వైరంగా మార్చాలని అనుకుంటున్నారు.
ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్లు దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తే.. వారి మనసులో పేరుకున్న అంటరానితనాన్ని ఎలా శుద్ధి చేయాలి.. నీళ్లతో కడగాలా? యాసిడితో కడగాలా?. శుద్ధి చేయాల్సింది మీ అహంకారం, అంటరానితనం ఆలోచనలను. కేసీఆర్ మనసులో పేరుకుపోయిన దొర అహంకారాన్ని. ఈ బాధ్యతను తెలంగాణ సమాజం తీసుకుంటుంది’ అని సీఎం స్పష్టం చేశారు.
సభాపతిగా మానసిక ధైర్యం కోల్పోవద్దు..
‘సభాపతిగా మీరు మానసిక ధైర్యం కోల్పోవద్దు. మీ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తేలేదు. చట్టాలు, సెక్షన్లు అడ్డుపెట్టుకుని కొంతమంది బెయిల్ పొందవచ్చు. కానీ, తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు. రజాకార్లను దిగంతాలకు తరిమి మ ట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది.ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ అని స్పీకర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
గత నెల ఉత్తరాఖండ్‌లో జరిగిన సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొని వెళ్లిన అనంతరం.. బీజేపీ అనుబంధ సంస్థ ఆ మైదానాన్ని శుద్ధి చేయించిం దని, ఆ సంఘటన మరువక ముందే తెలంగాణలో మరో దురదృష్టకర సంఘటన చో టు చేసుకోవడం సభ్యసమాజానికే అవమానకరమని పేర్కొన్నారు.
తీవ్రవాదులకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తేడా లేదు..
పార్లమెంట్, పుల్వామా దాడిలో పాల్గొ న్న తీవ్రవాదులు, కసబ్ వంటి ఉగ్రవాదులకు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తేడా లేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘కొంతమంది ముష్కరులు వచ్చి అసెంబ్లీ ఎదుట.. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై దాడి చేశారు. స్పీకర్‌తో పాటు వారి తల్లిని అవమానించారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను సమాజమంతా ఖండించింది. ప్రతిపక్ష నా యకుడు కేసీఆర్ వారి సభ్యులతో స్పీకర్‌కు క్షమాపణ చెప్పించి సభను సజావుగా జరిగేలా చూస్తారని అంతా భావించారు.
అలా జరగకపోగా మరింత ఉన్నాదంతో వ్యవహరించారు. స్పీకర్‌ను దూషించడాన్ని ఖండి స్తూ దళితులు డప్పులతో నిరసన తెలిపారు. ఎక్కడ కుట్ర జరిగిందో.. అక్కడ డప్పులు మోగించి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపట్టారు. ఫౌంహౌస్‌కు చాలా దూరంలో డప్పులు కొట్టి నిరసన తెలిపారే తప్ప.. ఎవరినీ దూషించలేదు, దాడి చేయలేదు.
దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని మాత్రమే వారు కోరారు. కానీ, అలా చేయకుండా మరో కుట్రకు ఆదేశించారు. సంధ్యారావు అనే నాయకురాలికి చెప్పి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు శుద్ధి చేశామని సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు’ అని సీఎం తెలిపారు. దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయించి, వారిని అవమానించారని దుయ్యబట్టారు.
రాజకీయ సమాధి తప్పదనే బీఆర్ఎస్ కుట్రలు..
ప్రజా సమస్యలపై చర్చ కోసమే తాము అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 22ఏ భూములు, విద్యారంగ సమస్యలతో పాటు మిగతా అంశాలను చర్చించాలనుకున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలపై చర్చ జరిగి తే వారికి రాజకీయ సమాధి తప్పదనే బీఆర్ఎస్ కుట్రలు పన్నిందని ఆరోపించారు. కుట్రల్లో భాగంగానే అసెంబ్లీ సమావేశాలకు ముందురోజు కేసీఆర్.. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుని ప్రణాళిక అమలుకు దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు నమ్మకం, విశ్వాసమని, గొప్ప లక్ష్యంతో ఆవిర్భవించిన పార్టీ అని, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని సీఎం పేర్కొన్నారు.
దళితులంటే బీఆర్ఎస్కు చిన్నచూపు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
స్పీకర్నుఅవమానించిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది పో యి, ఎర్రవల్లిలో దళితులు నడిచిన ప్రదేశంలో పసుపు నీళ్లతో శుద్ధి చేయ డం అత్యంత హేయమైన చర్య అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం సాధించుకున్న రాష్ట్రం లో దళితుల పట్ల ఇలాంటి వివక్ష, చిన్నచూపు ప్రదర్శించడం యావత్ తెలం గాణ సమాజం తలదించుకునే ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నాయకత్వం తమ కార్యకర్తల ద్వారా శుద్ధీకరణ చేయించడం వారి ఆలోచనా విధానానికి అద్దం పడుతోందన్నారు. తెలంగా ణను సాధించుకున్నది ఆత్మగౌరవం కో సం అని, కానీ నేడు అదే తెలంగాణలో సామాజిక వివక్షకు చోటు కల్పించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
దళితులపై బీఆర్ఎస్కు ఉన్న చిన్నచూపునకు నిదర్శనం అని వ్యాఖ్యానించా రు. రాష్ట్రంలోని లక్షలాది దళితుల మ నోభావాలను ఈ ఘటన తీవ్రంగా గాయపరిచిందన్నారు. ఈ ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ ఏం చెబుతారని ప్రశ్నించారు. హరీష్‌రావు, కేటీఆర్ ఈ చర్యను సమర్థిస్తారా అని నిలదీశారు. అసలు ఘటనపై క్షమాపణ చెప్పాల్సిన బీఆర్ఎస్ నాయకత్వం సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ భావజాలం ఒక్కటే : మంత్రి సీతక్క
బీజేపీ, బీఆర్ఎస్ భావజాలం ఒకటేనని మంత్రి సీతక్క మండిపడ్డారు. దళితులు నిరసన తెలిపిన ఎర్రవల్లి ఫాంహౌస్ మార్గాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయించడం దుర్మార్గమని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే వెళ్లి వచ్చిన చోట బీజేపీ నేతలు కూడా అలాగే శుద్ధి చే శారని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ సభ్యులు పోడియంలోకి వచ్చి ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నా రని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి ఏకవచనంతో మాట్లాడటం సరికాదని, ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్నారు.
బీఆర్ఎస్ వక్రబుద్ధిని శుద్ధి చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి
ఫ్యూడల్, వివక్షపూరిత భావజాలాన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని డిప్యూటీ సెం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుద్ధి చేయాల్సింది నేలను కాదని, బీఆర్ఎస్ వక్రబుద్ధిని, వారి ఆలోచనలను అని.. దుయ్యబట్టారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్‌ను కించపర్చేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. వారి చర్యలను తీవ్రంగా ఖండించారు. దళితులు నడిచిన రహదారులను శుద్ధి చేసిన ఘటనకు సంబంధించిన పోస్టులు వెలువడటం మరింత బాధ కలిగించిందన్నారు.
ఇది కేవలం దళితులను అవమానించడం కాదని, మొత్తం తెలంగాణ సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. పదేళ్లు తెలం గాణను ఫ్యూడల్ భావజాలంతో పాలించిన వారు.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఫ్రస్టేషన్‌తో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని భట్టి విమర్శించారు. కనీ సం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారని భావించినా, సభలో అలాంటి వైఖరి కనిపించలేద న్నారు. సభాపతి స్థానాన్ని అవమానిస్తూ, బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని, స్పీకర్‌ను శాసించే హక్కు ఎవరికీ లేదని భట్టి మండిపడ్డారు.
పదేళ్ల పాటు పాలనలో ఉండి, మంత్రులుగా బా ధ్యతలు నిర్వర్తించిన అనుభవజ్ఞులు, ఉన్నత విద్యనభ్యసించిన వారు సభలో ఈ రకంగా వ్యవహరించడం తెలంగాణ సమాజానికే అవమానకరమని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలంగాణలో ఈ పరిణామాలు నెలకొనడం బాధాకరమని, ఇటువంటి ఘటనలను మేధావులు, ప్రగతిశీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.
కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవలు అందించాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని.. కేసీఆర్ చావును కోరుకోవడం లేదని భట్టి పేర్కొన్నారు. సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో సభా మర్యాదలను పాటించాలని, సభ సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
దొరతనపు పోకడలను తెలంగాణ ప్రజలు ఇక భరించడానికి సిద్ధంగా లేరని అన్నారు. బీఆర్ఎస్ నాయకత్వానికి సంబంధించిన ‘శుద్ధి కార్యక్రమం’ అంశంపై శాసనసభలో చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగలేదన్న బీజేపీ సభ్యుడు మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా భట్టి స్పందించారు.
ఏ యుగంలో ఉన్నాం.. : మంత్రి శ్రీధర్‌బాబు
దళితులు నిరసన తెలిపితే ఆ ప్రాం తాన్ని శుద్ధి చేయడం ఏమిటి?.. మనం ఏ యుగంలో ఉన్నాం. శాసనసభ ప్రాం గణంలో, సభ లోపల అసభ్యకరమైన పదజాలం వాడటాన్ని ఆమోదించే ప్రసక్తే లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన వందేళ్లకు పైగా బతికుండాలనే మేం కోరుకుంటున్నాం.