మాకు కొలువులేవీ?
సంప్రదాయ సబ్జెక్టుల పోస్టులు లేకుండానే డీఎల్ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
- అన్ని అర్హతలున్నా పోస్టులు లేకపోవడంతో పరీక్షలు రాయలేని పరిస్థితి
- ఆందోళనలో 50 వేల మంది అభ్యర్థులు
* ప్రభుత్వ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) నోటిఫికేషన్ కోసం తెలంగాణలో దాదాపు పదిహేనేళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నిరాశే ఎదురుకానుంది. త్వరలో రానున్న నోటిఫికేషన్‌లో సంప్రదాయ సబ్జెక్టుల పోస్టులను పూర్తిగా పక్కనపెట్టి ఇతర సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం ఇవ్వబోయే నోటిఫికేషన్‌లో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బోటనీ, జువాలజీ వంటి సంప్రదాయ సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులను చేర్చడంలేదనే ఆందోళనను అభ్యర్థులు వ్యక్తంచేస్తున్నారు. ఒకట్రెండు సబ్జెక్టులు మినహా అడ్వాన్స్‌డ్ కోర్సులతో 544 పోస్టులతో నోటిఫికేషన్ జారీచేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని అర్హత కలిగిన నెట్, సెట్, జేఆర్‌ఎఫ్ అభ్యర్థులకు సమాన పోటీ అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి, రాష్ట్రంలో నెట్, సెట్, జేఆర్‌ఎఫ్.. పీహెచ్‌డీ అర్హత సాధించి, ఏళ్లుగా - డీఎల్ నోటిఫికేషన్(DL Notification) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు సుమారు 50 వేల మందివరకు ఉన్నారు. అత్యధికంగా ఈ సంప్రదాయ సబ్జెక్టుల వారే ఉంటారు. వీరికి సంబంధించిన పోస్టులు వెలువడే నోటిఫికేషన్‌లో(Notification) లేకపోతే వీరి అర్హతలు వృథా అయినట్లే. ఏళ్లతరబడిగా కోచింగ్‌లు తీసుకుంటూ, డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగం(Teaching job) రానివారు, జూనియర్ లెక్చరర్ ఉద్యోగం రానివారు డిగ్రీ లెక్చరర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor)) ఉద్యోగమన్నా సాధిద్దామని అనుకుంటారు.
వాటికి నెలల తరబడి సన్నద్ధమవుతుంటారు. అభ్యర్థుల్లో సంప్రదాయ డిగ్రీలు చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పరిశ్రమలు, ఐటీ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు తమ సబ్జెక్టే లేదంటే మేం ఏం కావాలి? అని అభ్యర్థులు వాపోతున్నారు.
544 పోస్టులతో సరిపెట్టవద్దు..
డిసెంబర్ 2022లోనే 544 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ(TGPSC) ఇచ్చింది. కానీ అది ముందుకు సాగలేదు. యూజీసీ నూతన గైడ్‌లైన్స్ ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేపట్టేందుకు గానూ ఈ నెల 10న ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. దీనికితోడూ ఈ పోస్టుల భర్తీకు సంబంధించి జీవో నెం.4ను కూడా ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ సమయంలో ప్రతిపాదించిన పోస్టుల్లో కొన్ని సబ్జెక్టులకు మాత్రమే అధిక ప్రాధాన్యత లభించిందని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అనేక సంప్రదాయ సబ్జెక్టులకు సంబంధించిన మొత్తానికే పోస్టులు లేకపోవడం వల్ల వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశానికి దూరమయ్యే పరిస్థితి ఉంది. అప్పుడిచ్చిన నోటిఫికేషన్‌లో క్రాప్ ప్రొడక్షన్, డాటా సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, అప్లయిడ్ న్యూట్రీషన్, బయో టెక్నాలజీ, కామర్స్-టాక్సేషన్, కామర్స్ ఫారన్ ట్రేడ్, ఫిషరీస్, డైరీ సైన్స్, ఫిజికల్ డైరెక్టర్, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, స్టాటిస్టిక్స్ పోస్టులే ఉన్నాయి.
త్వరలో ఇవ్వబోయే నోటిఫికేషన్‌లోనూ దాదాపు ఇవే పోస్టులు మేజర్‌గా ఉండనున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో గతంలో గుర్తించిన ఈ 544 పోస్టులకే పరిమితం కాకుండా, గత 15 ఏళ్లలో ఏర్పడిన పదవీ విరమణలు, ఖాళీలు, విద్యార్థుల సంఖ్య, సబ్జెక్టుల వారీ అవసరాలను పరిగణనలోకి తీసుకుని మరో వెయ్యి పోస్టులను అదనంగా కలిపి సమగ్ర నోటిఫికేషన్ జారీచేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో గ్రూప్1 నియామక ప్రక్రియలో అవసరమైన పోస్టులను నోటిఫికేషన్ తర్వాత అదనంగా చేర్చిన విధంగానే, డిగ్రీ లెక్చరర్ నియామకంలో కూడా పాత పోస్టులకు అదనంగా ప్రస్తుతం ఉన్న వాస్తవ ఖాళీలను చేర్చాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అన్ని సబ్జెక్టులకు ఇవ్వాలి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సాంప్రదాయ కోర్సుల్లో విద్యార్థులు చేరుతున్నప్పుడు, ఆయా సబ్జెక్టులకు అవసరమైన రెగ్యులర్ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉంది. కళాశాలల్లో అన్ని కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకుంటూ, వారు చదివే ప్రధాన సబ్జెక్టులకు అధ్యాపక పోస్టులు లేకపోతే విద్యా నాణ్యత ఎలా మె రుగుపడుతుంది?. గత 15 ఏళ్లలో అధ్యాపకులు పదవీ విరమణ చేయడంతో ఖాళీలు మరింత పెరిగాయి. మరోవైపు కొత్తగా ప్రభు త్వ డిగ్రీ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులకు బోధనా సిబ్బంది అవసరం పెరుగుతోంది.
అందుకే రాబోయే డిగ్రీ లెక్చరర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) నోటిఫికేషన్‌లో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, హింది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధిస్తున్న అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఖాళీలను గుర్తిం చి చేర్చాలి. ఇది కేవలం ఉద్యోగార్థుల సమ స్య కాదని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల భవి ష్యత్తుకు సంబంధించిన అంశం. అదేవిధంగా జీవో నెం.4 కొత్త నియామక విధానా న్ని పునఃపరిశీలించాలని నెట్, సెట్, జేఆర్‌ఎఫ్ అభ్యర్థులు కోరుతున్నారు.
దుర్గం హరీష్, అభ్యర్థి