జీ 9 బొగ్గు లేనప్పుడు ఎందుకు కట్టారు?
- యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంపై ప్రశ్నించిన సీఎం రేవంత్
- నాడు రాజకీయ కారణాలతోనే అలా కట్టారన్న అధికారులు
- దసరాలోపు పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగాలని ముఖ్యమంత్రి ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): యాదాద్రి థర్మల్ కేంద్రం(Yadadri Thermal Power Station)లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి(Electricity generation) చేయకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్తును ఎందుకు ఉత్పత్తి చేయడంలేదని అధికారులను ప్రశ్నించారు. విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీ కేంద్రంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో ఉత్పత్తికి జీ 9 బొగ్గు అవసరమని అధికారులు వివరించారు.
సింగరేణి(Singareni)లో జీ 9 బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ సింగరేణి నుంచి జీ 9 బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం లేదని వారు తెలిపారు. జీ 9 బొగ్గు లభ్యత లేనప్పుడు ఆ సాంకేతికతతో ఎలా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
పిట్ హెడ్‌పై (బొగ్గు గనులపైనే విద్యుత్ కేంద్ర నిర్మాణం ఉండటం) కాకుండా, దూరంగా ఎందుకు ప్లాంట్ నిర్మించారని, దానికి బొగ్గు సరఫరాతో రాష్ట్రంపై పడే అదనపు భారం ఎంత అని అధికారులను ఆయన ప్రశ్నించారు. నాడు రాజకీయ కారణాలతోనే పిట్ హెడ్ పై కాకుండా దూరంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించారని అధికారులు తెలిపారు. యాదాద్రికి బొగ్గు సరఫరాతో తెలంగాణ రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల అదనపు భారం పడుతున్నదని వివరించారు.
జీ 9 బొగ్గు వేలంలో గత సర్కార్ పాల్గొనలేదు
సింగరేణి నుంచి జీ 9 బొగ్గుకు ఉన్న అవకాశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరా తీశారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో జీ 9 బొగ్గును సింగరేణి సరఫరా చేయలేదని, సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ అవసరాల దృష్ట్యా మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని అధికారులను సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు. తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో చర్చించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగాలన్నారు.
ప్రస్తుత అవసరాలకు విద్యుత్ కొనుగోలు
ఎత్తిపోతల పథకాల పంపులకు విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేసేలా చూడాలని అధికారులకు స్పష్టంచేశారు. ప్రస్తుత అవసరాలకు తగినట్లు విద్యుత్ కొనుగోలు చేయాలని, జెన్ కోకు సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలన్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలోనూ ఆటంకాలు ఉండొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. సాగుకు సోలార్ విద్యుత్ మాత్రమే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం డిస్కంలకు సూచించిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.