18 May, 2026 | 4:53 PM

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి

04-02-2025 06:20 PM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి...

వాంకిడి (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోనీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు తహసిల్దార్ రియాజ్ అలీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్, మండల విద్యాధికారి శివ చరణ్ కుమార్ లతో కలిసి పాఠశాల ఆవరణలో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్య బోధన అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి  చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

విద్యార్థులకు ఆట స్థలం సదుపాయం కల్పిస్తూనే సరైన స్థలంలో అదనపు గదుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఇందాని గ్రామంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యత, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, రిజిస్టర్లు, తరగతిగదులను పరిశీలించారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం డైట్ చార్జీలను 40 శాతం పెంచడం జరిగిందని, నూతన మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని, ఈ గ్రామంలో పాఠశాలలు చేపట్టిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల కొరకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని, ఆ ప్రకారంగా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని, 100 శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి మీనా, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, ఎ. ఈ. కిరణ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.