అన్నయ్య సినిమాకు తమ్ముడు క్లాప్
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ ద్వయం మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. ‘చిరుబాబీ2’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్‌కే నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులను అందించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ తెలుగులో తొలిసారి రూపొందిస్తున్న సినిమా ఇది.
ఇప్పటికే వరుస అప్డేట్స్‌తో భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్, నటుడు నాగబాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మెగా త్రయం వేదికను పంచుకున్న ఈ వేడుక అభిమానులకు కనులవిందుగా మారింది. పవన్ కళ్యాణ్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్‌ఆన్ చేశారు. వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. బీ గోపాల్, కోదండరామిరెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్టును అందజేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి లోహిత్ తన బృందంతో కలిసి హాజరయ్యారు. మ్యాసీవ్ స్కేల్, ఇంటెన్సిటీతో నిండిన ఈ కథలో చిరంజీవి తన కెరీర్లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్రలో నటించనుంది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంటోని రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి, హరిమోహనకృష్ణ, వినీత్ పొట్లూరి బృందం స్క్రీన్‌ప్లే అందించగా.. భాను-నందు ద్వయం డైలాగ్స్ రాస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం (నేడు) నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.






