గంగాజల స్నానానికి పోచమ్మనగలు

17-10-2026 | 08:22pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం(Adelli Sri Maha Pochamma Temple)లో గంగనీళ్ల జాతర(Ganga Neella Jatara) శనివారం ప్రారంభమైంది. ప్రతి ఏటా దసరా పండుగకు ముందు శని, ఆదివారాల్లో ఈ జాతర వేడుకలను నిర్వహిస్తారు. శనివారం ఉదయం ఆలయంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోచమ్మతల్లి ఆభరణాలను భాజా భజంత్రీల నడుమ పాదయాత్రగా గోదావరి నదికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో గ్రామస్తులు పసుపు, బండారుతో పాటు మంగళహారతులతో స్వాగతం పలికారు.

అమ్మవారి ఆభరణాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అడెల్లి నుంచి సుమారు 26 కిలోమీటర్ల దూరంలోని దిలావర్ పూర్ మండలం సాంగ్వి గ్రామానికి పాదయాత్రగా చేరుకొని శనివారం రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున గోదావరి జలాలతో అమ్మవారి ఆభరణాలను శుద్ధి చేసి తిరుగు ప్రయాణం కానున్నారు. అమ్మవారి ఆభరణాల ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు